మరో నూతన గుడివాడ నగరంగా ఆవిర్భవించిందా అన్నట్టు అనిపిస్తుంది !

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..


J.SURENDER KUMAR,

గుడివాడ నగర పరిసరాలు 257 ఎకరాల స్ధలం సేకరించి.. మరోవైపు టిడ్కో ఇళ్లు.. ఇంకోవైపు ఇళ్ల స్దలాలు ఇచ్చి నిర్మాణంలో ఉన్న ఇళ్లు చూస్తుంటే…ఇక్కడ మరో నూతన గుడివాడ నగరం ఆవిర్భవించిందా అన్నట్టు కనబడుతున్నది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు శుక్రవారం పంపిణీ చేసిన సందర్భంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఆయన మాటల్లో..

జగనన్న కాలనీలో అక్షరాలా 16,240 కుటుంబాలు అంటే ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా. 40వేలకు పై చిలుకు జనాభా జగనన్న లే అవుట్‌లో నివాసం ఉండబోతున్నారు. ఇక్కడ ₹800 కోట్లతో 8,912 ఇళ్లు కట్టడమే కాకుండా.. వాటిని నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఇదే లే అవుట్‌లో 7,728 ఇళ్లస్ధలాలును చేసి వాటిని ఇళ్లులేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. ఈ లేఅవుట్‌లో ఇంతకముందు నేను చెప్పినట్టు 7728 ఇళ్లపట్టాలతో కలిపి 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి 16,240 కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి.

👉ఇళ్లు కాదు ఊళ్లు .

ఇవాల దేవుడి దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్కచెల్లెమ్మలను హక్కుదారులగా ఆయా కుటుంబాల చరిత్రలను మార్చే విధంగా ఇవాళ మనం కడుతున్నది ఇళ్లు కాదు ఊళ్లు అని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరుగుతుంది. మనం కడుతున్నది ఇళ్లు కాదు ఊళ్లు అని ఇదే మాట నేను ఇంతకముందు చెప్పాను.

👉 ₹1కే 300 అడుగుల ఇళ్లు..

ఈ మాటే కాకుండా 300 అడుగుల టిడ్కో ఇళ్ల లబ్ధిదారులందరికీ చెప్పాను.. దేవుడి దయ వలన మనం అధికారంలోకి వస్తాం. ఉచితంగా ఈ 300 అడుగులు టిడ్కో ఇళ్లను రూ.1 కే ఇస్తామని ఇదే గుడివాడ బహిరంగసభలో చెప్పాను. నేను చెప్పినదాన్నే ఈరోజు నిజం చేసి చూపిస్తున్నాను. ఇవిగో ఆ ఇళ్లు ఇవిగో ఆ ఊళ్లు అని రాష్ట్రానికే కాదు దేశానికే చూపిస్తున్నాను.

👉గుడివాడ నియోజకవర్గంలో 22వేల మందికి లబ్ది..

ఈ నియోజకవర్గం మొత్తం చూస్తే… ఈ లేవుట్‌లో 7728 ఇళ్లపట్టాలతే కలిపి 13,145 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటికి 8,912 టిడ్కో ఇళ్లు కూడాకలిపితే గుడివాడలోనే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్ధలాలిచ్చామని గర్వంగా చెబుతున్నాను.
ఇక్కడకు వచ్చే ముందు ఎమ్మెల్యే నానిని అడిగాను. ఈ లేఅవుట్‌లో వీళ్లకి ఇచ్చిన ఇంటిస్ధలం విలువ ఎంత ఉంటుందని అడిగాను. గజం ₹14వేలు ఉంటుందని, ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన స్ధలం ₹.7 లక్షల దాకా సెంటు విలువ ఉంటుందని చెప్పాడు. అంటే ఇవాళ ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చిన 1.1 సెంటు అంటే ₹.7 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టయింది. ఈ ఇళ్ల స్ధలాలలో ఇంటి నిర్మాణం పూర్తయితే కనీసం ₹.10 నుంచి ₹12 లక్షల రూపాయలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టవుతుంది.
ఇక్కడ రాకమునుపు ఇదే వేదిక మీద అడిగాడు. 7,728 ఇళ్ల పట్టాలు ఈ లేవుట్‌లో ఇచ్చాం. ఇందులో 4,200 ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఇళ్లు కూడా మంజూరైతే.. మొత్తం 13,145 ఇళ్లపట్టాలలో ఇళ్లు కూడా వస్తాయని చెప్పాడు. ఇప్పటికే ఇచ్చిన 8,859 ఇళ్లకు అదనంగా జూలై 8, నాన్నగారి జయంతి రోజున మరో 4,200 ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నాం. ఇది మనం ఇటు గుడివాడలోనూ, రాష్ట్రంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రస్ఫుటంగా ప్రతి గ్రామంలో కనిపించేటట్టుగా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో, మమకారంతో అడుగులు వేశాం.

👉30.60 లక్షల మందికి ఇళ్లపట్టాలు….

మనందరి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్లపట్టాలివ్వడం జరిగింది. ఇప్పటికే రెండుదశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తున్న కాలనీలు 17,000. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000.
అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ ఏరియాను బట్టి కనీసం ₹.2.5 లక్షల నుంచి ₹10 లక్షల దాకా ఉంటుంది. మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ 30,60,000 ఇళ్ల పట్టాల మీద కనీస విలువ ఒక్కో ఇంటికి ₹.2.50 లక్షలు తీసుకుంటే… ₹75,000 కోట్ల ఆస్తులను ఇల్ల పట్టాల రూపంలోఅక్కచెల్లెమ్మలకు అందజేస్తున్నాం.

పేదలందరికీ ఇళ్లు నిర్మించే ఈ మహాయజ్ఞంలో ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమంలో ఒక్కో ఇంటిని రూ. 2.70 లక్షలతో ఇంటిని కడుతున్నాం. అది పూర్తవగానే అక్కడ డ్రెయిన్లు, రోడ్లు, ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ఖర్చు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. ఇంటి స్థలం విలువ రూ. 6 లక్షల నుంచి రూ.10, రూ.15 లక్షల దాకా కూడా పోతుందని చెప్పడానికి గర్వ పడుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల ఇళ్లు కూడా చూసుకుంటే మహాయజ్ఞం ద్వారా రూ. 2 నుంచి రూ. 3 లక్షల కోట్ల ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం.

👉దేవుడు నాకిచ్చిన అవకాశానికి ఇంతకన్నా సంతోషం ఉంటుందా ?

ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష్య, ద్వేషం ఎక్కువయ్యాయి. ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్దాలు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాలు మీకు తెలియాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకం ఒక్కసారి చూస్తే… నిరుపేదలు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్‌ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు ₹ 2వేలు చొప్పున ఒక్కో ప్లాట్‌ కు దాదాపు ₹.5.75 లక్షలు కట్టడానికి, మౌలిక సదుపాయాలకు మరో ₹1 లక్ష అవుతుంది.
దాదాపు 300 అడుగులు చొప్పున ఒక్కొక్కదానికి రూ. 6.75 లక్షలు ఖర్చయ్యే ప్లాట్‌ కు కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.5 లక్ష ఇస్తోంది. మిగిలిన రూ. 3 లక్షలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా 3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూ పోవాలి. ఆ 20 సంవత్సరాలలో ప్రతినెలా ఆ రూ.3వేలు కడుతూ పోతే… రూ.7.20 లక్షలు తన జేబు నుంచి కడుతూ పోవాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు.
కానీ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగులలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు .. 1,43,600 ఇళ్లను అన్ని హక్కులతో ఫ్రీ రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నాం. వీటి విలువ ₹ 6.75 లక్షలు. వీటిని ఒక్క రూపాయికే నా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం.

👉ఇదొక్కటే కాదు

365 చదరపు అడుగుల ఇళ్లు, 430 చదరపు ఇళ్లు కూడా ఉన్నాయి. 365 చదరపు అడుగులు ఇళ్లకి సంబంధించి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న ₹ 3 లక్షల సబ్సిడీకి అదనంగా 365 చదరపు అడుగులు ఇళ్లకు ₹ 50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత ₹ 3 లక్షలు ఇవ్వడంతో పాటు వాటిలో సిమెంటు రోడ్డులు, ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ కోసం మరో ₹ 1 లక్ష ఖర్చుపెట్టడమేకాకుండా, మరో ₹ 25 వేలు కలిపి ప్రతి పేద వాడికి ₹ 4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం.
ఇక 430 చదరపు అడుగులుతీసుకున్న ప్రతి పేద వాడికీ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ₹ 3 లక్షలు కాకుండా, మౌలికసదుపాయాలు కోసం రూ.1లక్ష వేసుకుని… గతంలో తీసుకున్న డిపాజిట్‌ను ₹1లక్ష నుంచి ₹ 50 వేలకు తగ్గించాం. ₹.50వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. ₹4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం.

👉టిడ్కో ద్వారానే ₹.16,601 కోట్ల లబ్ది…

ఒక్క టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మన ప్రభుత్వం ₹ 16,601 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఖర్చు భరిస్తోంది. ఇది వాస్తవం అయితే, ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి ? అని అడుగుతున్నాను. గుమాస్తాగిరీ పని కూడా సరిగ్గా చేయలేదు. తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప బాబు చేసిందేమిటి? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.