రోళ్లవాగుపై మాట్లాడే అర్హత జీవన్ రెడ్డికి లేదు – మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J.SURENDER KUMAR.

రూపాయి ఖర్చుపెట్టకుండా కాలం గడిపి రోల్లవాగు ప్రాజెక్టు పూర్తి దశలోకి రాగానే విమర్శలకు దిగుతున్న జీవన్ రెడ్డి, గతాన్ని గుర్తుచేసుకొని మాట్లాడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మంగళవారం చివరి దశలోకి వచ్చిన రోల్లవాగు ప్రాజెక్టు పనుల పరిశీలన, రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేపట్టారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రోల్లవాగు ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ₹136 కోట్ల ఖర్చుతో చేపట్టిందన్నారు. చివరి దశలోకి పనులు చేరాయని త్వరలోనే పనులు ముగుస్తాయని దింట్లో ఒక టీఎంసీ నీటి నిల్వ ఉంటుందని మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురిలోని 25 గ్రామాలకు సాగు నీరందుతుందన్నారు. 20 వేల ఎకరాలకు సాగు నీరంది 25 గ్రామాలు సస్యశ్యామలం ఆవుతాయని మంత్రి అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారన్నారు. 2017 లో మంత్రి హరీష్ రావు రోల్లవాగు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లు రాష్ట్రంలో పరిపాలన చేసిందని అలాగే జీవన్ రెడ్డి మంత్రిగా పనిచేశారని అన్నారు. కానీ ఏనాడు రోల్లవాగు అభివృద్ధిపై జీవన్ రెడ్డి ఆలోచించలేదని అన్నారు. కేవలం అధికార పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను చేపట్టిన అభివృద్ధి పనులను జీవన్ రెడ్డి విమర్శించడమే పనిగా చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.


ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్, బీర్పూర్ సర్పంచ్ శిల్ప, నాయకులు మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు, జిల్లా, మండల రైతు బందు సమితి కన్వీనర్ కొలుముల రమణ, రాజేశం, SE జి అశోక్,మాజీ జెడ్పీటీసీ శంకర్,మాజీ మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.