గల్ఫ్ వలసలపై సర్వే చేస్తున్న ప్రభుత్వం !
తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో గల్ఫ్ వలసలపై ఈనెల 13 నుంచి సర్వే ప్రారంభమైంది. గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు గల్ఫ్ తదితర దేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు నమోదు చేస్తున్నారు. గల్ఫ్ కార్మికుని పేరు, ఏ దేశంలో ఉన్నాడు, ఏం పని చేస్తున్నాడు, మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ లు సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముందుగా ప్రయోగాత్మకంగా బాల్కొండ ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.
తెలంగాణ లోని 32 గల్ఫ్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలలో అధిక గల్ఫ్ వలసలు ఉన్న నిర్మల్, ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి (ఎస్సీ), ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ ఒక మోస్తరు గల్ఫ్ వలసలు ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి నియోజకవర్గాలలో గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ఇటీవలి అంచనాలు తెలియజేస్తున్నాయి.
సమగ్ర సర్వే చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గల్ఫ్ వలసలపై శాస్త్రీయమైన, సమగ్ర సర్వే చేయాలి. సర్వే సమాచారంతో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన ప్రణాళికలు రూపొందించాలి. తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ లో విభాగం-సి కాలం నెం.17 లో ‘విదేశాలలో పనిచేస్తున్నారా ,? అనే ఒక ప్రశ్న ఉన్నది. కానీ అవగాహన లోపం, హడావుడి వలన ఈ విషయం సరిగా నమోదు కాలేదు. ఈ సర్వేతో తెలంగాణ ప్రవాసీల సంఖ్య ఎంత అన్నది తేలలేదు.

వ్యాసకర్త:
మంద భీంరెడ్డి, గల్ఫ్ వలసల విశ్లేషకులు