సామాజిక మిత్రుల దాతృత్వం బాధిత కుటుంబాలకు ₹ 1.26 లక్షలు సాయం!

J.SURENDER KUMAR,

ప్రస్తుత సమాజంలో తమ కుటుంబ క్షేమం కోసమే ఆలోచిస్తున్న తరుణంలో ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు ఫేస్ బుక్ మిత్రులు ₹ 1.26 లక్షలు సాయం అందించి దాతృత్వం చాటుకున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి.

ధర్మపురి మండల కేంద్రానికి చెందిన జక్కు ప్రవీణ్ గత 20 ఏళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించగా భార్య శ్రీదేవి తన కుమారుడు , కూతురును పోషిస్తూ తాత్కాలిక ఉద్యోగం చేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. దురదృష్టవశాత్తు శ్రీదేవికి క్యాన్సర్ వ్యాధి సోకడంతో వైద్య ఖర్చులు భారంగా మారాయి.
ఇదిలా ఉండగా వెల్గటూర్ మండల్ కిషన్ రావు పేట గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చి లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ, భార్య ఇద్దరు పిల్లను పోషిస్తూ, అద్దె ఇంట్లో ఉండేవారు. నాలుగు నెలల క్రితం శ్రావణ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో భార్య సప్ప సింధుజ అదే అద్దె ఇంట్లో ఉంటూ, ,చిన్నపిల్లలైన ఇద్దరు కుమారులను పోషిస్తుండగా కుటుంబ పోషణ , ఇంటి అద్దె భారంగా మారింది.
వీధి ఇరువురి కుటుంబాల సమస్యల్ని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి జూలై 5న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి వారికి సాయం అందించాలని కోరాడు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు, ఇతర దాతలు కలిసి ₹ 1.26 లక్షలు సింధుజ బ్యాంకు ఖాతాకు పంపించగా , వాటిని రమేష్ బ్యాంక్ అధికారులతో కలిసి శ్రీదేవి కుటుంబానికి ₹ 70 వేలు, సింధుజ కుటుంబానికి ₹ 56 వేలు పంపిణీ చేయించారు.