👉ఆ దేశాల చట్టాలపై అవగాహన కల్పించాలి!
J.SURENDER KUMAR.
కఠినమైన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలలో తెలంగాణ యువత తెలిసీ తెలియక, అవగాహన లేకుండా డ్రగ్స్ ఉచ్చులో పడి జీవిత ఖైదు అనుభవిస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒళ్ళు నొప్పి మాత్రలు, గసగసాలు, మత్తు పదార్థాల సరఫరా రాకెట్ లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడు జనవరిలో మత్తు పదార్థాల కేసులో అనుమానితుడిగా యూఏఈ దేశంలో దుబాయ్‌లో అరెస్టయ్యాడు. ప్రస్తుతం అబుదాబి లోని సుహాన్ సెంట్రల్ జైల్లో మగ్గుతూ విచారణను ఎదుర్కొంటున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఒక యువ ఇంజనీర్ భద్రతా కేసులో నాలుగేళ్ల క్రితం అరెస్టయి అబుదాబి జైల్లో మగ్గుతున్నాడు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి, జగిత్యాల జిల్లా కన్నాపూర్ కు చెందిన ఇద్దరు కార్మికులు ఒళ్లు నొప్పితో కూడిన కేసుల్లో, కామారెడ్డి జిల్లా కరడ్ పల్లికి చెందిన ఒక కార్మికుడు గంజాయి కేసులో వేరుగా దుబాయ్ జైల్లో గత పదేళ్లుగా మగ్గుతున్నారు. ఈ ముగ్గురి కుటుంబ సభ్యులు 2016లో ఢిల్లీ వెళ్లి అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్2023 ఆగస్టు 11న లోక్ సభకు ఇచ్చిన సమాచారం ప్రకారం 4,630 మంది ప్రవాస భారతీయులు ఆరు అరబ్ గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో వివిధ కేసులలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక శిక్షలు పడిన ఖైదీలు, విచారణ ఖైదీలు కూడా ఉన్నారు. యూఏఈలో (1,611), సౌదీ అరేబియాలో (1,461), ఖతార్‌లో (696), కువైట్‌లో (446), బహరెన్‌లో (277), ఒమాన్‌లో (139) మంది జైళ్లలో ఉన్నారు.

ఆదేశ చట్టాలపై అవగాహన కలిగించాలి!శ్రీనివాసరావు.!
విదేశాల్లో ఖైదు చేయబడిన భారతీయులకు కాన్సులర్ అసిస్టెన్స్ (దౌత్య సహాయం), లీగల్ ఎయిడ్ (న్యాయ సహాయం) అందించాలని కోరుట్ల కు చెందిన గల్ఫ్ జెఏసి నాయకుడు, ఎస్‌ఐఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు భారత ప్రభుత్వాన్ని ప్రకటించారు. కార్మికులకు గల్ఫ్ దేశాల చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలి. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ కు అధిక నిధులను కేటాయించి పేద కార్మికులను ఆదుకోవాలి. ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఎంబాసీలలో ప్యానల్ లాయర్ల సంఖ్యను పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.