ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌!

J.SURENDER KUMAR,
ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న భార్యభర్తలు కలిసి ఉండేందుకు వీలుగా అదనపు పాయింట్లు కేటాయించడానికీ అనుమతినిచ్చింది. అయితే టీచర్ల యూనియన్ల నేతలకు బదిలీల్లో ప్రాధాన్యమివ్వడం సమర్థనీయం లేదని పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే బదిలీలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేస్తూ.. బదిలీల జీవోపై గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది.

పదోన్నతులకు మార్గం సుగమమైంది. బదిలీలకు పచ్చజెండా ఊపిన హైకోర్టు.. జీవోపై గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు ఇవ్వడానికి అనుమతినిచ్చిన హైకోర్టు.. యూనియన్ల ఆఫీస్ బేరర్లకు బదిలీల్లో ప్రాధాన్యమివ్వడాన్ని సమర్థనీయంగా కనిపించడం లేదని అభిప్రాయపడింది. కాబట్టి యూనియన్ల నేతలకు అదనంగా పది పాయింట్లను ఇవ్వకుండా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

73 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు!

ఫిబ్రవరిలో వెబ్ కౌన్సెలింగ్ లో బదిలీల కోసం 73,803 మంది టీచర్లు దరఖాస్తు చేస్తున్నారు. అయితే భార్యభర్తలు, యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు.. జీవోపై స్టే ఇస్తూ మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో.. బదిలీలతో పాటు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం వద్ద బుధవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పీవీ కృష్ణయ్య, ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు వాదించారు. నిబంధనల సవరణ చట్ట ప్రకారం జరగలేదని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. నిబంధనల్లో మార్పులు జీవో ద్వారా చేయడానికి వీల్లేదని.. అసెంబ్లీ ఆమోదంతో గవర్నర్ చేయాలని న్యాయవాది కృష్ణయ్య వాదించారు. భార్యభర్తల కేటగిరీ అమలు చేయాల్సి వస్తే ప్రైవేట్ ఉద్యోగులకూ అమలు చేయాలన్నారు. బదిలీలకు సంబంధించిన నిబంధనలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. ఈనెల 5న అసెంబ్లీ ముందుంచామని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు.

ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం, టీచర్ల యూనియన్ల నేతలకు, అదనపు పాయింట్ల కేటాయింపు సమర్థనీయంగా కనిపించడం లేదని అభిప్రాయపడింది. దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి అనుమతినిచ్చిన ధర్మాసనం.. భార్యభర్తలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతో నిబంధన ఉందని పేర్కొంది. టీచర్ల యూనియన్లకు అదనపు పాయింట్లను పక్కన పెట్టి బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే బదిలీలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో సుమారు 30వేల మంది బదిలీలతో పాటు.. దాదాపు 9వేల మందికి పదోన్నతులు రానున్నాయి.