యుద్ధనౌక ప్రస్థానంలో… జగిత్యాల ఓ జైత్రయాత్ర!

J. SURENDER KUMAR.

అణగారిన వర్గాల పాటయ్యాడు.. దేహంలో తూటా దిగినా వెనుకడుగు వేయని రక్తసింధూరమై.. తన ఆటతో విప్లవోద్యమాన్ని ఉర్రూతలూగించాడు. నాటి పీపుల్స్ వార్ ఉద్యమాన్ని ఊరూరా తీసుకుపోయి పొడుస్తున్న పొద్దు మీద నడిచే కాలమయ్యాడు. తల్లిదండ్రులు పెట్టి ముద్దుగా పిల్చుకున్న గుమ్మడి విఠల్ పేరుతో పెరిగాడు.. గద్దర్ గా సుపరిచితుడై.. అనారోగ్యంతో కాలం చేసినా ప్రజల హృదయాల్లో పాటై.. పదం పదం కలిపి కాలుకు కట్టిన గజ్జెల సవ్వడితో తెలంగాణా జానపద వాగ్గేయకారుడిగా జన నీరాజనాలందుకున్నాడు. పీపుల్స్ వార్ ఆవిర్భావానికే నాంది అయిన జగిత్యాల జైత్రయాత్ర.. ఆ యుద్ధనౌక ప్రస్థానంలోనూ ఓ మరుపురాని ఘట్టమే మరి!

నాటి పీపుల్స్ వార్ ఆవిర్భావానికైనా.. నేటి మావోయిస్టు ఉద్యమానికైనా.. జగిత్యాల జైత్రయాత్ర ఓ వేదికైంది. ఓవైపు రష్యా, ఇంకోవైపు చైనా ఇలా రెండు పరస్పర విరుద్ధ భావజాలాలతో మొదలైన కమ్యూనిజం.. వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతంలో నక్సల్ బరీ ఉద్యమానికి ఊపిరిపోస్తే.. ఆ తర్వాత పుట్టుకొచ్చిన పీపుల్స్ వార్, మావోయిస్టుల పార్టీల ప్రస్థానంలో విప్లవాన్ని రగిలించింది జగిత్యాల జైత్రయాత్ర. అందుకే జగిత్యాల మావోయిస్ట్ ఉద్యమంలో ఓ ప్రయోగశాలైంది. జగిత్యాల కేంద్రంగా 1978లో జరిగిన రైతు కూలీ సంఘం సభ.. భారతదేశ చరిత్రలో పీపుల్స్ వార్ ప్రస్థానంలో.. మావోయిస్ట్ ప్రయాణంలో ఓ మైలురాయి. అలాంటి సభ యుద్ధనౌక గద్దరన్న ఆటాపాటతో ఉర్రూతలూగింది. తమ హక్కుల సాధనకై గ్రామీణులు ప్రశ్నించే గొంతుకైంది. అణగారిన వర్గాలను అక్కునజేర్చుకున్న ఆర్తి అయింది.

రైతు కూలీ సంఘాల ఏర్పాటు…

1976 -77 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని గ్రామాల్లో భూస్వాములు, దొరల ఇండ్లలో చాకలి, మంగలి, కుమ్మరి, తదితర కుల వృత్తుల వారు వెట్టిచాకిరి షరా మామూలుగా కనిపించేది. ఏదో మొక్కుబడి జీతాలతో పాలేర్ల బతుకుచిత్రం అత్యంత దయనీయంగా ఉండేది. వర్షాకాలంలో భూస్వాముల భూముల్లో వ్యక్తులే కాడెడ్లుగా మారి నాగళ్ళు దున్నడం నుంచి మొదలుకుంటే.. పంట పొలాల్లో కలుపు తీసేవరకూ.. భూస్వాముల ముందు చెప్పులు కూడా వేసుకు తిరగలేని ఫ్యూడజం కళ్లకు కట్టిన రోజులవి. భార్యాభర్తల వివాదం నుంచి మొదలు.. కుటుంబ కలహాలు, భూవివాదాలు ఏవైనా సరే.. ఆయా గ్రామ భూస్వాముల పంచాయతీ తీర్పుకు ఎదురు చెప్పడం కత్తిమీద సామే.
ఇక పోలీస్ పటేల్, పట్వారీల వ్యవస్థలో వాళ్లదే ఇష్టారాజ్యం. ముక్కుపిండి ఎందుకు వసూలు చేస్తున్నారో.. దేనికో కూడా చెప్పకుండా పన్నులు వసూలు చేస్తే పల్లెత్తు మాటనేందుకు నాడు గ్రామీణులు హడలిపోయేవారు. ఈ తరుణంలో వామపక్ష భావజాలం గల యువత గ్రామాలకు తరలండి అనే నినాదం ఉవ్వెత్తు తరంగమైంది. ఆ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో స్థితిగతులను అంచనా వేయడానికి పట్టణాల నుంచి చైతన్యవంతులు గ్రామాల బాటపట్టారు. అలా ఊరూరు కలిసి ఏర్పడిందే రైతు కూలీ సంఘం. వామపక్షజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాటి నియంతృంత్వ శక్తులకు ఎదురొడ్డి నిలవడానికి వ్యూహాత్మకంగా వామపక్ష మేధావులు పెట్టిన పేరే రైతు కూలీ సంఘం.
జగిత్యాల జిల్లాకే చెందిన బీర్పూర్ వాసి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి తనవంతుగా బీర్పూర్ మండలంలో గుట్ట కింది గ్రామాలైన నరసింహులపల్లి, తుంగూర్, కొల్వాయి, తాళ్లధర్మారం, రేకులపల్లి, రంగసాగర్, మంగెల తదితర గ్రామాల్లో రజకులు, వ్యవసాయదారులు, పనిముట్లు చేసేవారిగా మారువేశాల్లో కొందరిని.. నెలరోజుల పాటు గ్రామాల్లో ఉండి అక్కడి స్థితిగతులను పరిశీలించడానికి పంపారు. ఈ నేపథ్యంలోనే వారు గ్రామ గ్రామాన రైతు కూలీసంఘాలను ఏర్పాటుచేసి హక్కుల సాధన కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం తిరుగుబాటుకు నడుం బిగించారు. అందులో భాగంగా పశువులను మేపడానికి నిరాకరించడం, రజకులు బట్టలు ఉతకకపోవడం, భూస్వాముల ఇళ్ళ ముందు చాన్పు చల్లకపోవడం, పంట పొలాలకు కాల్వల ద్వారా నీరు అందించకపోవడం, వ్యవసాయ క్షేత్రాల్లో కలుపు తీయడానికి నిరాకరించడం… తదితర అంశాల్లో గ్రామీణులను ఏకతాటిపైకి తెచ్చి గ్రామ గ్రామాన రైతు కూలీ సంఘాలు ఏర్పాటులో విజయం సాధించారు. అలా రైతు కూలీసంఘం సభ కోసం ఓ చర్చ ప్రారంభమైంది.
అలా జగిత్యాల పేరు ప్రస్తావనకొచ్చి..

జగిత్యాల జైత్రయాత్రకు బీజం పడింది. రైతు కూలీ సంఘ సభ నిర్వహణ కోసం నాటి రైతు కూలీ సంఘల నిర్మాణసభ్యులు.. వార్ ఆవిర్భావంతో నక్సల్స్ నాయకులుగా గుర్తింపు పొందిన ముంజల రత్నయ్య, ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, కైరి గంగారం, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ, దగ్గు రాయలింగు, ఇట్టె లక్ష్మీనారాయణ, శీలం నరేష్, శంకర్ రెడ్డి, నల్లా ఆదిరెడ్డి తదితరులు సభ విజయవంతం కోసం తమ పని ప్రారంభించారు. సమాచార, రవాణా వ్యవస్థ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు.. గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని గ్రామగ్రామాన తిరిగి వేలాదిగా జన సమీకరణ చేశారు. జగిత్యాల్ పట్టణ వీధుల్లో వేలాది మంది రైతు కూలీలు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు.
జగిత్యాల జైత్రయాత్రలో కీలక ఘట్టంగా ఆవిర్భవించిన రైతు కూలీ సంఘానికి ముక్కు సుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా.. వరవరరావు ప్రధాన వక్త. అయితే, రైతు కూలీసంఘం సభ్యులుగా.. ఆ తర్వాత మావోయిస్ కీలక నాయకులుగా ఎదిగిన వారి కృషి నాటి జైత్రయాత్రలతో ఎంత కీలకమైందో… ఆ జైత్రయాత్ర సభ ఆసాంతం రక్తి కట్టించిన విప్లవగీతం ప్రజా యుద్ధనౌక గద్దరయ్యాడు. గజ్జ కట్టి వేదికపై గద్దర్ ఆడిపాడుతుంటే.. నాటి భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పాలకుల్లో ఆందోళన రేకెత్తింది. అందుకే జగిత్యాల సభ అనంతరం అప్పటి చెన్నారెడ్డి ప్రభుత్వం జగిత్యాలను కల్లోలితో ప్రాంతంగా ప్రకటించింది. ప్రముఖ రచయిత, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు వంటివారు కూడా ప్రభుత్వ ఉద్యోగం వదలి అజ్ఞాతవాసం పట్టాల్సి వచ్చింది. అదే సమయంలో ఇదే డివిజన్ లోని లొత్తునూర్ లో గ్రామీణలు తిరుగుబాటు చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటనపై అప్పటి కేంద్రంలోని జనతా ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. విచారణ కమిషన్ కు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు నాడు చైర్మన్ గా వ్యవహరించారు.
పీపుల్స్ వార్…


జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో 1980లో కొండపల్లి సీతారామయ్యతో పాటు మరికొందరు.. ఆదిలాబాద్ జిల్లా లక్షెటిపేట శివారులో మొక్కజొన్న తోటలో రైతు కూలీ సంఘాన్ని.. రూపాంతరం చేసి.. పీపుల్స్ వార్ పార్టీగా నామకరణం చేసి ప్రకటించారు. వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య మంచిర్యాల జిల్లా జన్నారంలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పని చేస్తూ అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నాడు ఉత్పన్నమయ్యాయి. పీపుల్స్ వార్ పార్టీ
ఆవిర్భావానికి.. రైతు కూలీసంఘం పేరిట జగిత్యాలలో ఏర్పాటు చేసిన సభ ఎంత సంచలనంగా మారిందో.. జగిత్యాల జైత్రయాత్రగా ఎలాగైతే కొత్త చరిత్రను లిఖించిందో.. ఆ చరిత్రలో ప్రజా యుద్ధనౌక గద్దర్ దీ ఓ కీలకపాత్ర కావడం విశేషం. ఆ స్ఫూర్తే కొనసాగుతూ

..1980 ఏప్రిల్ ఇంద్రవెల్లి ఆదివాసీల తిరుగుబాటు ఉద్యమానికి కూడా ఊపిరిలూదింది.
అలా భూమి కోసం, భుక్తి కోసం.. అణగారినవారి గొంతుకై.. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమై… విప్లవసూరీడై ప్రకాశించిన గద్దర్.. భౌతికంగా కనిపించకుండా పోయినప్పటికీ.. తన పాట రూపంలో.. గజ్జె కట్టిన తన ఆటరూపంలో విప్లవం వర్ధిల్లే ప్రతీచోటా ఉదయిస్తూనే ఉంటాడు.
జోహార్ గద్దరన్న…💐💐🙏🏻