జాతీయ సేవా పథకం సేవే లక్ష్యంగా…
సెప్టెంబర్ 24 N.S.S డే..

సమాజంలో యువకులు విద్యార్థి దశలోనే తన స్థానాన్ని, గమ్యాన్ని నిర్ణయించుకొనేలా చేయాలనే ఆశయంతో విద్యార్థులలో చిత్తశుద్ధి, క్రమశిక్షణ, సామాజిక సేవదృక్పధం పెంచాలనే ప్రధాన ధ్వేయం తో జాతీయ సేవా పథకం( NSS)ను 1969 సెప్టెంబర్ 24వ తేదీన మన దేశవ్యాప్తంగాప్రారంభించారు.యువతీ యువకులలో సేవాభావం, దేశభక్తి, సామాజిక స్పృహ ను కలిగించేందుకు ‘జాతీయ సేవాపథకం’  (NSS) ప్రారంభమైంది.


1970 నుండి 2000వరకు విద్యార్థులకు సమాజంతో ఎక్కువ అనుబంధం ఉండేది.వారు వివిధ సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించేవారు.అయితే గత ఇరవై ఏళ్ళలో విద్యలో ప్రయివేటీకరణ వేగం పుంజుకుంది. దీంతో ర్యాంకుల హడావిడి మొదలయింది. డి.ఎస్. కొఠారి (1964-66) నేతృత్వంలోని విద్యా కమీషన్, విద్య అన్ని దశలలో ఉన్న విద్యార్థులను ఏదో ఒక విధమైన సామాజిక సేవతో ముడిపెట్టాలని సిఫారసు చేసింది. ఏప్రిల్ 1967 సంవత్సరంలో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రి వారి సమావేశంలో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే అప్పటికే విశ్వవిద్యాలయ దశలో, స్వచ్ఛంద ప్రాతిపదికన ఉనికిలో ఉన్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సి సి) లో చేరడానికి విద్యార్థులను అనుమతించాలని, దీనికి ప్రత్యామ్నాయాన్ని నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్) అని పిలువబడే కొత్త కార్యక్రమం రూపంలో వారికి అందించవచ్చని వారు సిఫార్సు చేశారు. 1969 సంవత్సరంలో సెప్టెంబరులో జరిగిన వైస్ చాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఈ సిఫారసు ప్రకారంగా,సమస్యను వివరంగా పరిశీలించడానికి వైస్ చాన్సలర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచించారు. భారత ప్రభుత్వ విద్యపై జాతీయ విధానం ప్రకటనలో, పని అనుభవం, జాతీయ సేవ విద్యలో అంతర్భాగంగా ఉండాలని నిర్దేశించబడింది. మే, 1969 సంవత్సరంలో, విద్యా మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల ప్రతినిధుల సమావేశం కూడా ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనను అంగీకరించాయి.
నిరుపేదల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ, సమాజ సేవ చేసే లక్ష్యంతో జాతిపిత మహాత్మా గాంధీ శతజయంతి సందర్భంగా 1969 సెప్టెంబర్ 24వ తేదీన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 37 విశ్వ విద్యాలయాలలో సుమారు 40,000 మంది వాలంటీర్లతో అప్పటి కేంద్ర విద్యాశాఖా మాత్యులు వి.కె.ఆర్.రావు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఒకవైపు విద్యా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు సంఘసేవకు విద్యార్థులను సమాయాత్తపరచేదే జాతీయ సేవా పథకం. సామాజిక కార్యక్రమాలపై యువతకు తర్ఫీదునివ్వడమే గాక, వారి సేవలను వినియోగించుకోవడం ఎన్‌ఎస్‌ఎస్‌లో కనిపిస్తుంది. మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, రక్తదాన శిబిరాలు, అక్షరాస్యత వంటి కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
కళాశాల స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలకు ప్రిన్సిపాల్ పర్యవేక్షకుడిగా, ఒక అధ్యాపకుడు ప్రోగ్రాం అధికారిగా వ్యవహరిస్తారు. సమాజ సేవ పట్ల ఆసక్తి చూపే విద్యార్థులను ఇందులో చేర్చుకుంటూ, ప్రతి వందమంది విద్యార్థులను ఒక యూనిట్‌గా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూంటారు. రెండు విద్యా సంవత్సరాలలో కనీసం 240 గంటలు సంఘసేవలో పాల్గొనేలా కృషి జరుగుతోంది. భావితరాలకు వారసులైన విద్యార్థులు జట్లుగా పనిచేస్తూ ఐక్యతా భావాన్ని పంచుకుంటారు.  కళాశాల ప్రిన్సిపాల్ నిర్ణయించిన ప్రకారం సమీప ప్రదేశాల్లో ఆలయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాలలో అపరిశుభ్రతను తొలగించడం, మంచినీటి సౌకర్యాల మెరుగుదలకు శ్రమదానం, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలలో నిర్వహిస్తుంటారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి వసతులను గ్రామస్తుల సహకారంతో మెరుగుపరచేందుకు విద్యార్థులు కృషి చేస్తారు. రక్తదానం, ఉత్సవాలలో స్వచ్ఛంద సేవ, అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు విరాళాలు సేకరించి తగు సహాయ సహకారాలను అందించడం కూడా ఎన్‌ఎస్‌ఎస్ సేవా కార్యక్రమాలుగా ఉన్నాయి. అక్షరాస్యతా కార్యక్రమాల అమలులో భాగస్వాములు కావడం, ఆరోగ్య సూత్రాలను బోధించడం, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలను చైతన్య పరచడం వంటి కార్యక్రమాల్లోనూ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలకు గుర్తింపుగావిశ్వవిద్యాలయాలు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తాయి. ఉద్యోగ నియామకాలు, ఇతర సందర్భాల్లో ఈ సర్ట్ఫికెట్లకు విలువ ఉంటుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, మిలటరీ, నర్సింగ్ సర్వీసులలో, పోలీసు, టెలికాం, సమాచార వ్యవస్థ తదితర విభాగాల్లో నియామకాల సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ సర్ట్ఫికెట్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.అదే విధంగా ఎన్ సి సి కు కూడా మంచి ఆదరణ ఉంది.
విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ భావి భారతాన్ని నిర్ణయించవలసినది యువకులే. ప్రతి దేశ పురోభివృద్ధిలోనూ, ఉద్యమాలలోనూ విద్యార్థులు పాలుపంచుకుంటారు. ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువ కావచ్చు కానీ కల్లాకపటం తేలియని నిర్మల మనస్కులు వీరు. వీరు కూడా సంఘజీవులే, సంఘంలో భాగస్వాములే, కాబట్టి సామాజికసేవ (సోషల్ సర్వీస్) చేసే వాళ్ళకి బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.
నా కోసం కాదు, నీ కోసమే అనే దీక్షా నినాదంతో- సేవలు అందించడమే ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల లక్ష్యం. యువతలో సామాజిక స్పృహను కల్పిస్తూ, వారిని సేవాభావంతో ముందుకు నడిపించడం నిరంతర కార్యక్రమంగా కొనసాగాలి.కానీ ప్రస్తుతం విద్యార్థులకు,సమాజంతో ప్రత్యక్ష అనుబంధం తెగిపోయింది. పెరిగిన సిలబస్ వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. పిల్లలు మానసిక ఒత్తిడి తట్టుకోవాలంటే వారు సమాజంతో మమేకమవ్వాలి.ఇందుకు జాతీయ సేవా పథకం వంటివి దోహదపడతాయి.


వ్యాసకర్త:  యం. రాం ప్రదీప్, తిరువూరు !
మొబైల్ 9492712836