👉 ఎవరు విడిచిన బాణమో ? సోనియా ఇంటికి మాత్రం వెళ్ళింది !
J.SURENDER KUMAR.
తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరంగా పనిచేస్తునే ఉంటుంది. కెసిఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ‘ అని గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో వైయస్సార్ టిపి పార్టీ అధ్యక్షురాలు, స్వర్గీయ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల మాట్లాడిన మాటల్లో ఇదో అంశం. వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న చరిష్మా మేరకు ఆయన కూతురుగా వైయస్ షర్మిలకు గుర్తింపు ఉంది తప్ప ఆమెకు మరే చరిష్మా లేదనేది జగమెరిగిన సత్యం.. అయితే తెలంగాణ ప్రజలు మేలు కోసం అంటూ, షర్మిల మీడియా ముందు మాట్లాడిన తీరు ఆమె పరిపక్వత లేని రాజకీయ అజ్ఞానమా ? అహంకారమా ? లేక తన రాజకీయ చతురతను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరు అనే భావనా కాబోలు..
పై ప్రస్తావన ఎందుకంటే ….
గురువారం షర్మిల భర్త అనిల్ తో కలిసి ఢిల్లీలో 10 జన్ లో సోనియా గాంధీ ఇంటికి వెళ్ళింది. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనమా ? లేక ఇతర రాజకీయ సమీకరణా లో అనే అంశంలో స్పష్టత లేదు.
2021 ఫిబ్రవరిలో షర్మిల తెలంగాణలో వైయస్సార్ టీపీ పార్టీ పెట్టినప్పుడు ఆమెను, బిజెపి, టిఆర్ఎస్, వైయస్ జగన్మోహన్ రెడ్డి వదలిన బాణమంటూ రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకున్న విషయం విధితమే. ( ఏపీలో షర్మిల చేసిన, ఓదార్పు యాత్ర ,ఎన్నికల ప్రచారంలోనూ తనకు తానుగా ‘నేను జగనన్న వదిలిన బాణం’ అని ప్రకటించుకోవడంతో, తెలంగాణలో పార్టీ పెట్టిన నేపథ్యంలో ఆమె ఎవరు వదిలినా బాణం ? అనే చర్చ రాజకీయాల్లో జరిగింది.)
తెలంగాణ గడ్డలో …
తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి యత్నించిన స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తనయ షర్మిల. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పార్లమెంట్ లో ప్లే కార్డులు ప్రదర్శించిన వైయస్సార్ పార్టీ అధినేత, ఏపీ సీఎం, సోదరి షర్మిల అక్క.. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా నిరంతరం పనిచేస్తాను అంటే నమ్మేది ఎవరు ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన రక్తసంబంధం, అదే తెలంగాణ రాష్ట్రంలో ‘ రాజన్న రాజ్యం తెస్తాను’ అంటూ మీడియా సమావేశంలో చిలక పలుకులు పలుకుతే నమ్మేది ఎవరు ? అనే సవా లక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ గడ్డ మీద పార్టీ నడపడం నా తరం కాదు అంటూ ఢిల్లీలో సోనియా గాంధీ వద్దకు వెళ్ళిన షర్మిల దంపతులు, తమ పార్టీ నీ కాంగ్రెస్ విలీనం కోసం విశ్వయత్నాలు చేస్తున్న షర్మిలమ్మ, ఇదే గడ్డ ప్రజల మేలు కోసం పోరాడుతాను, జెండా ఎగర వేస్తాను, కర్ర సాము చేస్తా, రైతులు, విద్యార్థులు, సంతోషపెడతాను అంటే నమ్మే నాటి అమాయక తెలంగాణ ప్రజలు ఇప్పుడు లేరు, ఆటుపోట్లు, ఆత్మ బలిదానాల తో అమరులు ఆశించిన రాష్ట్రాన్ని సాధించుకున్న అరవీర భయంకర వీరులు ఉన్న తెలంగాణ ఇది.
ఆమె నోటి వెంట ‘మన రాష్ట్ర అభివృద్ధి కోసం, ‘మన ప్రజల సంక్షేమం కోసం, అంటూ వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల సంబోధించిన సందర్భాలు ఉన్నాయా ? లేవా ? అని తరిచి చూస్తే లేవని చెప్పాల్సి ఉంటుంది. అతిరథ రాజకీయ పార్టీలకు, నాయకులకు, రాజకీయ నిరుద్యోగ గడ్డి తినిపించిన తెలంగాణ గడ్డ అనే విషయం రానున్న రోజుల్లో ఆమెకే తెలుస్తుంది కాబోలు.
వైయస్సార్ హాయంలో ప్రజా సంక్షేమ పాలన!
2004 నుంచి సెప్టెంబర్ 9 వరకు రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఆయన పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంలో మృతి చెందడంతో ఇదే ప్రభుత్వం 2014 వరకు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. వైఎస్సార్ పాలనలో ఆసరా పెన్షన్ పెరుగుదల, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రియంబర్స్మెంట్, రేషన్ కార్డుల జారీ, 108 అంబులెన్స్ సేవలు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, జలయజ్ఞం, ప్రభుత్వ పథకాలతో ఇది పేదల సంక్షేమ ప్రభుత్వం గా, రైతు సంక్షేమ ప్రభుత్వం గా ప్రజల మన్ననలు పొందిన విషయం వాస్తవమే. పేద ప్రజలకు, బడుగు, బలహీన వర్గాలకు, విద్యార్థిలోకం కు విద్య, వైద్యం అందించి ఉచిత సేవలతో తెలంగాణ ప్రజలే కాక, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కూడా ఆయనను గుండెల్లో పెట్టుకొని అభిమానించే వారు ఉన్నారు, ఆదరించే వారు ఉన్నారు. ఇది అక్షర సత్యం.
ఇదే సందర్భంలో …
తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా తొక్కి పెట్టడం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు అనే భావన తెలంగాణ వాదులు నెలకొని ఉంది. శాంతి చర్చల పేరిట నక్సలైట్లను పిలవడం, అర్ధవంతంగా చర్చలు వాయిదా పడడం, తదనంతరం జరిగిన అనేక ఎదురుకాల్పుల్లో చర్చలకు వచ్చిన ఒకరిద్దరు మినహా, నక్సలైట్ నాయకులు మరణించడం,ఆ ఉద్యమం బలహీన పడడం తదితర అంశాలు కాకతాళీయమే అయినా, 15 శాతం ప్రజలలో వైఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన ఉందని చెప్పాల్సి వస్తుంది.
కెసిఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా ?
సోనియా గాంధీని కలిసిన తర్వాత హైదరాబాదులో మీడియా తో షర్మిల మాట్లాడిన మాటలలో ‘ కెసిఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ‘ అన్నారు.
తెలంగాణ సమాజం చైతన్య వంతమైనది, మంచి చెడులు బేరీజు వేసుకుంటూ లక్ష్య సాధనకు అడుగులు ముందుకు వేస్తున్న యువత, ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రజా కంటక పాలకులతో, పాటు కేసీఆర్ ను సైతం.రాజకీయ అందలం ఎక్కించడం, ఆదపాతాళంలోకి నెట్టడంలోనూ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి నాయకత్వం, సలహాలు, తెలంగాణ ప్రజలకు అవసరం లేదు.
లక్ష్య సాధన కోసం మలిదశ తెలంగాణ పోరాట ఉద్యమంలో దశాబ్దం పైగా కాలంగా జరిగిన ఆందోళనలో, ఉద్యమాలలో బస్సు ల దగ్ధం చేయడం కానీ సీమాంధ్రులపై వారి ఆస్తులపై రాష్ట్రంలో దాడులు జరగలేదు. ప్రాణ నష్టం జరగలేదు ఇది తెలంగాణ సమాజంలో ఉన్న నిబద్ధత అని చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తెలంగాణ నాయకులు పార్టీ అధినేత తెలంగాణ అంశంపై యూ టర్న్ తీసుకోవడంతో వారు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. రాజన్న రాజ్యం తెస్తానని అంటూ చిలక పలుకులు పలికిన షర్మిలమ్మ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ( శుక్రవారం నాటికి చేయలేదు) షర్మిల అక్కను నమ్ముకుని ఆమె పార్టీలో చేరిన కొందరు తెలంగాణ నాయకులు రాజకీయ నిరుద్యోగులు గా మారడం ఖాయం.
ఆవిర్భవిస్తున్నాయి.. అదృశ్యం అవుతున్నాయి !

ఉమ్మడి రాష్ట్రంతో పాటు స్వరాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి కొంతకాలానికి అదృశ్యం అవుతున్నాయి. ఆవిర్భవించిన ప్రాంతీయ పార్టీలలో టిడిపి, టిఆర్ఎస్ మినహ ఏ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోలేదు. ప్రముఖ మేధావి సీనియర్ ఐఏఎస్ ఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ, తన కలెక్టర్ పదవికి రాజీనామా చేసి లోక్ సత్తా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, అనేకసార్లు ఎన్నికల్లో పోటీ చేయగా ఒకసారి ఆయనకు ఎమ్మెల్యేగా పదవి భాగ్యం లభించింది. ప్రముఖ సినీ హీరో డాక్టర్ చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి 20 ఎమ్మెల్యే సీట్లు, గణనీయమైన ఓట్లు సాధించిన ఆయన తనపార్టీని కాంగ్రెస్ లో కలిపారు. జేఏసీ చైర్మన్ తెలంగాణ సాధన ఉద్యమ రథసారథి, ప్రొఫెసర్ కోదండరామ్ జన సమితి పార్టీ. ఎన్టీ రామారావు తనయుడు స్వర్గీయ హరికృష్ణ ‘అన్న తెలుగుదేశం ‘ పార్టీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తెలుగుదేశం ఎన్టీఆర్ ని ‘డాక్టర్ చెరుకు సుధాకర్ ‘ఇంటి పార్టీ ‘. తెలంగాణ ఉద్యమ నాయకుడు బాలకృష్ణ రెడ్డి ఓ పార్టీ, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ , సినీ నటి విజయశాంతి , స్వర్గీయ మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి, స్వర్గీయ మాజీ సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రజా సమితి పార్టీ, విప్లవ పంథా లో జనశక్తి, ప్రజా ప్రతిఘటన ,తదితర అనేక పార్టీలు మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని తదితరులు ఆర్బాటంగా ఆవిర్భవింపజేసిన ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం వాటి అడ్రస్ లు అదృష్టమవుతున్నాయి. అదే బాటలో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్ టిపి పార్టీ అదృశ్యం అవుతుంది కాబోలు.