స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుక్వాష్‌ పిటీషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు!

👉స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రిమాండ్ చెల్లదని క్వాష్‌ పిటిషన్ వేసిన చంద్రబాబు

👉చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

J.SURENDER KUMAR


ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్, ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రిమాండ్ చెల్లదని క్వాష్‌ పిటిషన్ వేసిన చంద్రబాబు.


24 వరకు రిమాండ్ పొడగింపు..


మరోవైపు అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈనెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.


ఈ సందర్భంగా న్యాయమూర్తి చంద్రబాబును తన అభిప్రాయాన్ని కోరారు. దీంతో చంద్రబాబు తన అభిప్రాయాన్ని తెలిపారు. జైలులో తనను ఏంతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని న్యాయమూర్తితో అన్నారు. తన హక్కులు కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని చంద్రబాబు కోరారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబును పోలీసులు ఏసీబీ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. రిమాండ్‌ సమయం శుక్రవారం నాటికి ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీసుకొచ్చారు.
 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తనదని.. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని చంద్రబాబు చెప్పారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందని.. అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని.. తన మీద ఉన్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని.. నిర్ధరణ కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే నా బాధ, ఆవేదన, ఆక్రందన అని చంద్రబాబు అన్నారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని జడ్జిని కోరారు.
మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే
ఏసిబీ న్యాయమూర్తి..
 చంద్రబాబు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నానన్న జడ్జి.. మీరు పోలీసు కస్టడీలో లేరని.. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని చెప్పారు. దీన్ని శిక్షగా భావించవద్దన్నారు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని.. నేర నిరూపణ కాలేదని జడ్జి తెలిపారు. చట్టం, నిబంధనల ప్రకారమే రిమాండ్ విధించామని చెప్పారు.
జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని జడ్జి అడిగారు. సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశాలిస్తామని చెప్పారు. 24వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారని చంద్రబాబుకు జడ్జి తెలిపారు. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోందని.. మీ తరఫు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారని జడ్జి చెప్పారు.