J.SURENDER KUMAR,
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు గరుడసేవ ప్రారంభమైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం !
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

గరుడ సేవలో భక్తులను మైమరపింపచేసిన అష్టలక్ష్మీ నృత్యరూపకం !
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు శుక్రవారం రాత్రి గరుడ వాహన సేవలో సాంస్కృతిక వైవిధ్యం కనిపించేలా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళలను చక్కగా ప్రదర్శించారు. ఇందులో తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన అష్టలక్ష్మీ నృత్యరూపకం భక్తులను మైమరపింపచేసింది.
కేరళ నుండి పంచవాద్యం, ఒరియాడి, కథాకళి, మోహినియాట్టం, తమిళనాడు నుండి మొయిల్లాట్టం, మహారాష్ట్ర నుండి నాసిక్ డోలు, తెలంగాణ వారి దశావతార రూపకం, పేర్ణి నృత్య రూపకం, ఎపిలోని చిత్తూరు నుండి కీలుగుర్రాలు, రాజస్థాన్ నుండి దాండియా, జార్ఖండ్ నుండి సారికెళి చాహూ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మొత్తం 17 బృందాల్లో 422 మంది కళాకారులతో ప్రదర్శించిన కళారూపాలు గ్యాలరీలలోని భక్తులను ఆకట్టుకున్నాయి.
టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల నృత్య దర్శకత్వం వహించి ప్రదర్శింపచేసిన అష్టలక్ష్మీ వైభవం భక్తుల మన్ననలు పొందింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, బోర్డు సభ్యులు యానాదయ్య,
సుబ్బరాజు, తిప్పేస్వామి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ శ్రీమతి హరిత ఇతర అధికారులు పాల్గొన్నారు.