ఆడపిల్ల దేశానికి గర్వకారణం !

👉 నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా !
                 ***
తల్లిదండ్రులను ప్రేమించడంలో ఆడపిల్లలను మించిన వారు ఇంకొకరు ఉండరంటే ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. తనకు వివాహం జరిగి అత్తారింటికి వెళ్లిపోయినా సరే.. తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తను ఎప్పటికీ మరచిపోదు. అందుకే పెద్దలు ‘కొడుకు ప్రేమ కోడలు వచ్చే వరకూ.. కూతురి ప్రేమ జీవితాంతం’ అని అంటూ ఉంటారు.అయితే వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆలోచించి చూస్తే ఆడపిల్లల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.


ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 19, 2011 న, అక్టోబర్ 11 ని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
కోవిడ్‌ 19 మహమ్మారి తర్వాత మానవ సంబంధాల్లో ఏర్పడ్డ సంఘర్షణల నేపథ్యంలో బాలికలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలికలు విద్య, శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నంటిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే లక్ష్యంతో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికలకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనాలను, వీడియోలను అందరితో పంచుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రజలకు పిలుపునిచ్చింది.
ఈ రోజు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వారి మానవ హక్కులను నెరవేర్చే దిశగా వారిని శక్తివంతం చేయడంపై దృష్టి సారించింది. అణగారిన బాలికల హక్కుల తరఫున గొంతు కావాలనేదే ఈ రోజు ప్రాముఖ్యత. బాలికలకు మెరుగైన ఆరోగ్య సేవలు, విద్యలో సమాన అవకాశాలు, లింగ-ఆధారిత వివక్ష, బాలికలపై హింసలేని సమాజ నిర్మాణం కోసం ఈ దినోత్సవం సందర్భంగా ప్రతినబూనాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.
ఇక మన దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పిస్తూ.. ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవం చేస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లను రక్షించాలి అనే వివిధ ప్రచారాలు, కార్యక్రమాలను నిర్వహిస్తారు.


ఈ ఏడాది “ఇన్వెస్ట్ ఇన్ గర్ల్స్, అవర్ లీడర్షిప్, అవర్ వెల్ బీయింగ్” అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నారు.బాలుర నిష్పత్తితో పోల్చుకుంటే, బాలికల సంఖ్య రోజురోజుకూ తగ్గుతుంది. వారిపై లైంగిక వేధింపులు కూడా పెరుగుతున్నాయి.సావిత్రి బాయి పూలే  వంటి వారు బాలికా విద్యకై ఎనలేని కృషి చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాలికల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.అయితే ఇవి క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. వీటిని మరింత పటిష్టంగా అమలు చేయాలి.అదే విధంగా బాల్య వివాహాలని నియంత్రణ చేయాలి. బాలికా విద్యను ప్రోత్సహించాలి.అప్పుడే వారి జీవితాల్లో వెలుగు జాడలు కన్పిస్తాయి.

వ్యాసకర్త :

యం. రాం ప్రదీప్, జేవివి సీనియర్ సభ్యులు,
తిరువూరు  మొబైల్: 9492712836