👉 కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్
👉సి విజల్ యాప్ పై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలి !
👉 న్యూఢిల్లీ నుంచి వీడియో సమావేశం!
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు.
న్యూ ఢిల్లీ నుండి సోమవారం ఎన్నికల పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారు లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా
సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ,

👉 నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన, ఎన్నికల నిబంధనలు పాటించాలని అన్నారు.
👉ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
👉అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలనీ,
👉అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
👉పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు .
👉పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈవీఎం యంత్రాలు తరలించే అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు
👉పోలింగ్ కేంద్రాలలో అవసరమైన విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు, వంటి అన్ని రకాల వసతులు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.
👉ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
👉పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని, సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు.
👉మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని అన్నారు. రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని అన్నారు.
👉ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని,
👉జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి ప్రతి రోజు వచ్చే అప్పీల్ పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ₹ 10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.
👉 నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా వివిధ నోడల్ అధికారులతో మాట్లాడుతూ,
సి విజిల్ యాప్ పై పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించి యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఏ ఆధారం లేని డబ్బు, సరుకులు రవాణా చేయకుండా ప్రజలకు తెలియజేయాలని, ₹ 50 వేల రూపాయల కన్న ఎక్కువ నగదు తీసుక వెళ్లకూడదనే విషయాన్ని ప్రజలకు తెలియ పరచాలని సూచించారు. ఎన్నికల నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండి విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. సర్వీస్ ఓటర్లు, ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు
పోస్టల్ బ్యాలెట్ కోసం అర్హత కలిగిన వారు నిర్ణీత ఫారం 12 లో వివరాలను సమర్పించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని నోడల్ అధికారిని ఆదేశించారు. 80 సంవత్సరాలకు పైబడిన వారు, 40 శాతం కన్నా అంగవైకల్యం కలిగిన వారు ఇంటినుండి ఓటుహక్కు కల్పించుకునేందుకు నిర్ణీత ఫారం 12 డి లో పూర్తి వివరాలతో ఆయా అధికారులకు సమర్పించాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా ప్రచార వాహనాలు, నిబంధనల మేరకు ప్రచురణకు అనుమతిలేని ప్రచార కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీ లు ఏర్పాటు, పంపిణీ చేస్తున్నట్లు తెలిసిందని, అట్టి వాటికి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో అక్రమంగా మద్యం రవాణా, అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉందని, అబ్కారీ అధికారులు పోలీసు సిబ్బంది సహకారంతో దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయాలని అన్నారు. బెల్టు షాపులు పూర్తిగా తొలగించాలని అన్నారు. ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత ప్రాంతాలలో దాడులు నిర్వహించాలన్నారు. ఓటుహక్కు కలిగిన ప్రతీ ఒక్కరు విధిగా ఓటు వేసే విధంగా ప్రచారం స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహించాలని అన్నారు. నోడల్ అధికారులు రోజువారీ నివేదికలను సమర్పించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీఓ/రిటర్నింగ్ అధికారులు రాజేశ్వర్, నరసింహ మూర్తి, డి.ఎస్.పి.లు, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.