అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ‘ఓట్  ఫ్రమ్ హోమ్’
అవకాశం!

👉 రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు 35,356


👉  18-19 యువతి ఓటర్ల సంఖ్య 3.45 లక్షలు!


👉 66 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు అధికం


👉 కేంద్ర ఎన్నికల కమిషనర్​ రాజీవ్​కుమార్​ !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుంచి ఓటేసే అవకాశం కల్పించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్​ రాజీవ్​కుమార్​ గురువారం వివరించారు. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్​ పర్యటన ముగింపు సందర్భంగా పలు విషయాలను ఆయన ప్రకటించారు. మరోవైపు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తునట్టు ఆయన వివరించారు.

  ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ పలు విషయాలను వెల్లడించారు.
తెలంగాణలో గడచిన రెండేళ్లలో 22 లక్షలకు పైగా ఓట్లను తొలిగించినట్లు సీఈసీ రాజీవ్​కుమార్​ పేర్కొన్నారు. వీటిని ఏకపక్షంగా తొలగించలేదని.. ఫామ్​ అందిన తర్వాతే తొలిగించినట్లు స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్త ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్​లో భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయమన్నారు.
నాలుగు గిరిజన తెగల్లో నూరు శాతం ఓటర్లు నమోదు జరిగిందని కేంద్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,356 ఉన్నాయని.. సగటున ఒక్కో పోలింగ్​ స్టేషన్​లో ఓటర్ల సంఖ్య 897గా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారని.. ఎన్నికల్లో ధనం, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయన్నారు. ఓటర్లు జాబితాలో అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశాయన్నారు.
జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించినట్లు తెలిపారు. 18-19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారని.. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిపేందుకు ఈసీ చిత్తశుద్ధితో ఉన్నట్లు రాజీవ్​కుమార్​ స్పష్టం చేశారు.
ప్రభావంపై స్పెషల్​ రాడార్​
డబ్బు పంపిణీ, మద్యం,  ఎన్నికల వేళ డబ్బు పంపిణీ మద్యం కానుకల ప్రభావంపై స్పెషల్​ రాడార్​  ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల వేళ అధికారులు పటిష్ఠంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. డబ్బులు పంచే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల కమిషనర్​ హెచ్చరించారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో డబ్బు కోసం ఓటర్లు ధర్నా చేసిన అంశం తమ దృష్టికి వచ్చినట్లు గుర్తు చేశారు. ఎన్నికల వేళ అక్రమాలపై ఫిర్యాదు స్వీకరణ కోసం సీ విజిల్​ యాప్​ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పౌరులకు ఎలాంటి అక్రమాలు దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయవచ్చని రాజీవ్​కుమార్​ స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని.. ఓటర్లకు సాయం చేసేందుకు ఓటర్​ హెల్ప్​లైన్​ యాప్​ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. తప్పుడు అఫిడవిట్​ల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్లనున్నట్లు వెల్లడించారు.