జగిత్యాల జర్నలిస్టులపై వివక్షత ఎందుకు ?
మంత్రి కె టీ ఆర్ కు విన్నపం !

J.SURENDER KUMAR,

దశాబ్దాల కాలంగా జగిత్యాల జిల్లా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయింపులో కొనసాగుతున్న వివక్షతను ముఖ్యమంత్రి తనయుడు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం జగిత్యాల పర్యటనలో తమకు ఉపశమనం లభిస్తుందని జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రేపటి పర్యటనలో మంత్రి ప్రధానంగా వేలాదిమంది లబ్ధిదారులకు 3722 డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ల పంపిణీ నేపథ్యంలో.. వందలలో ఉన్న మా జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రెండు గుంటల నివేశన స్థలాలు పంపిణీ తమరికి, ప్రభుత్వానికి అతి చిన్న అంశం అని జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతం దశాబ్దాల కాలంగా నివేశన స్థలాల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికార ప్రజా ప్రతినిధుల, కలెక్టర్, ఆర్డీవోలు, తహసిల్దార్లు, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయామూ, రేపు మాపు అంటూ, ప్రభుత్వ అనుమతి అంటూ, ఈ స్థలం ఆ స్థలం అంటూ, జర్నలిస్టుల లిస్టు కావాలి అంటూ, అధికారులు ప్రజా ప్రతినిధులు చెప్పిందల్లా వారు కోరిన వివరాలు అందిస్తూ, స్థలాల కోసం ఆశగా ఎదురుచూస్తు అలసిపోయాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. మీ నియోజకవర్గంలో సిరిసిల్ల, కరీంనగర్, వేములవాడ, హుజురాబాద్, సిద్దిపేట, గజ్వేల్, ఖమ్మం, వరంగల్, జిల్లాలలో జర్నలిస్టులకు పంపిణీ చేసిన విధంగానే జగిత్యాల జిల్లా జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇప్పిస్తారని ఆశిస్తున్నాం.

జగిత్యాల పట్టణంలో మంత్రి కేటీఆర్ జర్నలిస్టులతో ఇంటి స్థలాల విషయంలో జులై మాసంలో మాట్లాడుతున్న దృశ్యం(ఫైల్)


జగిత్యాల పట్టణంలో తమరు జులై మాసంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవనికి విచ్చేసిన సందర్భంలో ఇంటి స్థలాల అంశం తమరి దృష్టికి సమిష్టిగా జర్నలిస్టు సభ్యులు తెచ్చారు. తమరు స్పందించి మీకు తప్పక న్యాయం చేస్తాను అంటూ ‘ సిరిసిల్లలో ఎలా ఇచ్చారో అదే తరహాలో వీరికి ఇవ్వండి అంటూ అధికారులను ఆదేశిస్తానని అన్నారని తమకు మనవి చేస్తున్నాం. డబుల్ బెడ్ రూములు పంపిణీ చేసి వేలాదిమంది లబ్ధిదారుల కుటుంబాలలో సంతోషాలను కలిగించనున్న మీరు, వంద మంది మా జర్నలిస్టు కుటుంబాలలో సంతోషం నింపాలని, మనవి చేస్తున్నాము.
రేపో,మాపో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే మా ఆశలు అడియాశలు కాకుండా త్వరితగతిన జర్నలిస్టులకు నివేశన స్థలాలు పంపిణీ చేస్తారని ఆశిస్తూ నమ్మకంతో మనవి చేస్తున్నాము.

నమస్కారములతో…
సురేందర్ కుమార్, జర్నలిస్ట్..