జర్నలిస్ట్స్ ఉద్యమ నేత ప్రభాకరన్ కు కన్నీటి వీడ్కోలు..

👉 పాలక్కాడ్ లో అంత్యక్రియలు !


J.SURENDER KUMAR,

శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన కేరళ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమనేత, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షులు, ప్రజా జర్నలిస్ట్ జి.ప్రభాకరన్ అంత్యక్రియలు కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ లో సోమవారం జరిగాయి.

జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభాకరన్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీలు ప్రభాకరన్ అంత్యక్రియలకు హాజరై నివాళి అర్పించారు.
ప్రభాకరన్ అకాల మరణం కేరళ రాష్ట్రానికే కాకుండా, జాతీయ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమానికి తీరని లోటని కె.శ్రీనివాస్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుండే వామపక్ష భావజాలంతో పనిచేసిన ప్రభాకరన్, విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు.  జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించి, పాట్రియట్ దినపత్రికలో కొంతకాలం, దాదాపు 20ఏండ్ల పాటు హిందూ దిన పత్రికలో, గత కొన్నేళ్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో జర్నలిస్టుగా ఎనలేని సేవలందించినట్లు ఆయన తెలిపారు. కేరళ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం దశాబ్దాల తరబడి ఎన్నో పోరాటాలు చేసినట్లు తెలిపారు.

అంతేకాకుండా జాతీయ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో ప్రభాకరన్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని శ్రీనివాస్ రెడ్డి పేర్కొంటూ, ఐజేయూ పక్షానా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో కేరళ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కే. క్రిష్ణన్ కుట్టి, ఎంపీ శ్రీకందన్, మాజీ మంత్రి ఇస్మాయిల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ చిత్ర, సిపిఐ రాష్ట్ర నాయకులు, చమున్నీ, అజయన్, సురేష్ రాజ్, బిజెపి రాష్ట్ర నాయకులు క్రిష్ణ దాస్, కైరళి టీవీ డైరెక్టర్ టి.ఆర్.అజయన్, ఎన్సీపీ నాయకులు రామస్వామి, కేరళ జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు సురేంద్రన్, కవిత భామ, రెతీశ్, సురేష్ బాబు, నాసర్, షబ్బీర్, జాబ్ జాన్, శీజు మాన్, రజిత తదితరులు  పాల్గొని ప్రభాకరన్ కు నివాళి అర్పించారు.