పోలీస్ – నక్సల్స్ పోరులో సమిధులైన సామాన్యులు !

👉నాటి ఉత్తర తెలంగాణ జిల్లాల దుస్థితి..

👉 రేపు పోలీస్ అమరవీరుల వారోత్సవ నేపథ్యంలో..

J.SURENDER KUMAR,

ఉత్తర తెలంగాణ జిల్లాలలో దశాబ్దన్నర కాలంపాటు పోలీస్ నక్సల్స్ పోరులో సామాన్యులు సమిదలయ్యారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. నాడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో తుపాకుల నీడలో అనేక గ్రామాలు, ప్రజలు, భయం భయం గా దుర్భర జీవనాన్ని గడిపారు. ఈ నేల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ నేపథ్యంలో… గ్రామీణ హృదయ విదారక గాయాలు, మౌనరోధనలు, అధికార అనధికార తుపాకుల, తూటాలు, మందుపాతర ల మారణ హోమం , పోలీసు లాటి దెబ్బలు, ప్రజా కోర్టులు, శిక్షలు, పోలీస్ కేసుల జ్ఞాపకాలు నేపథ్యం ఇలా ..

నక్సలైట్ అగ్ర నాయకులకు, నక్సలిజంకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పోలీసులకు నక్సల్స్ కు మధ్య జరిగిన పోరులో ప్రజా ప్రతినిధులు, ప్రజలు, చోటా మోటా రాజకీయ పార్టీల నాయకులు, సమిధలుగా మారి ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు వీధిన పడ్డాయి.

నాడు గ్రామాలలో జీవనం ప్రత్యక్ష నరక యాతన!

నక్సలైట్లకు సహకారాలు అందిస్తున్నారు, భోజనాలు పెడుతున్నారని, ప్రజా ప్రతినిధులను, చోటామోటా రాజకీయ నాయకులను పోలీసు లు టార్గెట్ చేసి వేధించడం. పోలీసులకు పట్టుబడిన తమ సానుభూతి పరులను, మిలిటెంట్లను విడిచిపెట్టడం లేదని, వారిపై కేసులు నమోదు చేస్తున్నారని, వారిని పోలీసులకు లొంగుబాటు చేయించి ఇన్ ఫార్మర్లు గా, మారుస్తున్నారని ప్రజా ప్రతినిధులను నక్సలైట్లు టార్గెట్ చేసి వేధించడం, గ్రామ బహిష్కరణ చేయడం నాడు సాధారణ అంశం.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికైన ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా నక్సలైట్ల కనుసన్నల్లో విధులు నిర్వహించాల్సిన దుస్థితి నాడు.
గ్రామాలలో ఏ వ్యక్తి నక్సలైట్లకు. ఎందుకు వర్గ శత్రువు అవుతాడో తెలియదు ?. ఏ ప్రజా ప్రతినిధి నీ వార్ నక్సలైట్లు ప్రజా కోర్టు నిర్వహించి ఎందుకు దేహ శుద్ధి చేస్తారో తెలియదు ? ఏ ప్రజాప్రతిని, ఏ పౌరుడిని నక్సల్స్ ఎందుకు చంపేవారో ? ఎందుకు చంపుతారో తెలిసేది కాదు. ఎవరి భూములు ఎందుకు కొనకుండా, సేద్యం చేయకుండా, ఎవరిని ఇన్ఫార్మర్ అంటూ గ్రామాల్లో వాల్ పోస్టర్ లు వేస్తారో ? తెలియని భయంకరమైన. దుస్థితి నాడు.


ప్రశ్నించే తత్వం కలిగి ఉన్న యువకులను, ప్రజలను, సానుభూతిపరులుగా, పోలీసు రికార్డులు నమోదు చేయడం, గ్రామాల్లోకి అర్ధరాత్రి , అపరరాత్రి పోలీస్ బలగాలు చుట్టు ముట్టి నక్సల్స్ సమాచారం కోసం గ్రామ చావడి వద్ద జనాన్ని చేర్చి లాఠీలతో బాధడం, బూట్లతో తన్నడం, కొట్టడం జరిగేది. ఇదే తరహాలో నక్సలైట్లు కూడా గ్రామాల్లో తమ సానుభూతిపరులపై కేసుల నమోదు ,. మిలిటెంట్ల పై పోలీసు దాడుల, ఉదంతాలపై ప్రజలను ప్రశ్నిస్తూ ప్రజా కోర్టులు నిర్వహించి అన్యాయంగా కొందరిని ప్రజల సమక్షంలో కొట్టడం, కాల్చి చంపడం నాడు షరా మామూలు.
గ్రామాల్లో భూస్వాముల భూములు కొనవద్దని, నక్సల్స్ హెచ్చరించడం, భూములను కొనుగోలు చేసిన రైతులను, పోలీస్ ఇన్ ఫార్మర్లు అంటూ చంపడం, .వారి ఇండ్లను ధ్వంసం చేయడం, తదితర ఆటుపోట్ల మధ్య గ్రామీణ ప్రజలు జీవనం కొనసాగించేవారు.

సారా అమ్మిన, తాగిన కఠిన శిక్షలు..

తెలుగుదేశ ప్రభుత్వ హాయంలో సారా నిషేధ ఉద్యమానికి నక్సల్స్ శ్రీకారం చుట్టారు, గ్రామాల్లో ప్రజలతో ఊరేగింపులు, సారా దుకాణల ధ్వంసం, గతంలో టార్గెట్ చేసి గ్రామాల నుంచి బహిష్కరించిన వారికి మినహాయింపు ఇచ్చి సారా ఉద్యమంలో పాల్గొనాలని హుకుం జారీ చేసేవారు.

నాలుక కోసిన నక్సల్స్…

సారా నిషేధం ఉద్యమ సమయంలో ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి చిన్న నక్కలపేట ఓ నాయకపూ తండా పరిసరాలు రాత్రి నక్సల్ దళం సంచరిస్తుండగా సారా తాగిన గిరిజనుడు వారికి తారసపడ్డాడు. గిరిజను పట్టుకున్న నక్సల్స్ నీకు సారా అమ్మింది ఎవరు ? సారా ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. సారా మత్తులో గిరిజనుడు నక్సలైట్లను పచ్చి బూతులు తిట్టాడు. దళంలో నక్సలైట్ ఒకరు గిరిజనుడితో ” నీవు మమ్మల్ని ఇన్ని తిట్లు తిడుతున్నావ్, నీ నాలుక పై పుట్టుమచ్చ ఉందా ? ఏది నీ నాలుక చూపించు అనడంతో. గిరిజనుడు నాలుకను బయటికి చాచి చూసుకో అంటూ చూపడంతో నక్సలైట్లు నాలుకను కత్తితో కట్ చేశారు.” సగం తెగిన నాలుకతో గిరిజనుడి బంధువులు ఆ రాత్రి ధర్మపురి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు. సారా నిషేధ ఉద్యమ. తీవ్రతను అంచనా వేసిన నాటి ప్రభుత్వం రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారి ధర్మపురికి పంపి సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుంది అంటే. ఉద్యమ తీవ్రత ఎంతో ఊహించవచ్చు.

మందు పాతర మారణ హోమంలో గాలిలో కలిసిన14 అమాయక ప్రాణాలు!

పోలీస్ అధికారులే టార్గెట్ గా నక్సలైట్లు బీర్పూర్ ఘాట్ రోడ్ లో 1989 సెప్టెంబర్ మాసంలో పేల్చిన మందు పాతర వికటించి జీప్ లో ప్రయాణిస్తున్న 14 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిశాయి. ( ప్రైవేటు జీప్ ను పోలీస్ అధికారుల ప్రయాణిస్తున్న జీప్ గా భావించి నక్సలైట్లు జీప్ ను మందు పాతర తో పేల్చారు)

తుపాకీ తూటాలకు అమాయకులు బలి !

నక్సలైట్లు టార్గెట్ చేసిన యువకుడిని సాయంత్రం వేళ జగిత్యాల కళాశాల మైదానంలో రిక్కి నిర్వహించి గుర్తించారు. ఈ దశలో పట్టణంలో విద్యుత్ అంతరాయంతో చీకటి అలుముకుంది. టార్గెట్ గా భావిస్తున్న యువకుడు మైదానం పక్క ఉన్న ఇంట్లోకి వెళ్లిపోయాడు. కరెంటు లేక ఇంట్లో గాలి లేకపోవడంతో అమాయకుడైన యువకుడు పరమేశ్వర్ రెడ్డి మైదానంలోకి వచ్చాడు. అదే ప్రాంతానికి వచ్చిన ఉన్న యువకుడిని టార్గెట్ గా అనుకొని భ్రమపడి నక్సల్స్ A.K 47 తో జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో అమాయకుడైన పరమేశ్వర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. టెలిఫోన్ శాఖ ఉద్యోగి వేల్పురి ఆడం, రమేష్ బాబు, మధుకర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడికి తుపాకీ తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురిలో కానిస్టేబుల్ కోమల్ రెడ్డినీ నక్సల్స్ కాల్చి చంపిన సంఘటనలో, పాన్ డబ్బా నిర్వహిస్తున్న ఇక్బాల్ తో పాటు అనేకమంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మల్యాల మండలం లోని తక్కలపల్లి. గ్రామంలో నక్సలైట్లకు టార్గెట్ అయినా ముదుగంటి రామ్ రెడ్డికి , బదులుగా ఆయన సోదరుడు, దశరథరెడ్డిని, రామ్ రెడ్డి గా భావించి హతమార్చారు
ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి నేరెళ్ల గ్రామంలో, రిటైర్డ్ ఎస్పీ రమేష్ బాబు, ఇంటిని నక్సల్స్ 1994, జులై లో రాత్రి పేల్చివేశారు. .అదే సమయంలో గ్రామంలోకి వస్తున్న కిరాయి జీప్ ను పోలీస్ జీప్ గా, భావించి నక్సల్స్ కాల్పులు జరిపారు. జగిత్యాల్ పట్టణానికి చెందిన జీప్ డ్రైవర్, ఎండి ఫయీం కు తుపాకీ తూటాలు తగిలి స్టీరింగ్ పై ప్రాణాలు వదిలాడు. వెలుగొండ గ్రామానికి చెందిన వెంకటేశం, అనే వ్యక్తికి కడుపులో నుంచి బుల్లెట్ దూసుకు వెళ్ళింది. జగిత్యాల ఆస్పత్రి నుంచి తమ బంధువులను రాత్రి కిరాయి జీపులో నేరెళ్ల గ్రామానికి వస్తుండగా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.. 1997 జనవరి లో. బీర్పూర్ గుట్టలో నక్సల్స్ కు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ‘వంట చెరుకు’ కోసం అడవికి వెళ్ళిన నారాయణ గౌడ్ అనే వ్యక్తి .తుపాకి తూటాలకు నేలకొరిగాడు. 1991 డిసెంబర్లో బిఎస్ఎఫ్ జవాన్లను హతమార్చేందుకు నక్సలైట్లు. హుస్నాబాద్ మండలం రామవరం, వద్ద పేల్చిన మందు పాతర సంఘటనలో ఏడుగురు పోలీసులతో, సహా వారి వెంట వెళ్లిన 9 మంది అమాయకులు మృతి చెందిన విషయం విధితమే.

అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలంటే నరకం!
నక్సలైట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపు ప్రజల పాలిట శాపంగా మారేది. దీనికితోడు నాడు మావోయిస్టు అగ్రనేత,. ముప్పల లక్ష్మణరావు,@ గణపతి స్వగ్రామం జగిత్యాల్ డివిజన్ బీర్పూర్ కావడంతో గణపతి గ్రామం తో పాటు గుట్ట కింది 10 గ్రామాలలో ఎన్నికల బహిష్కరణ ప్రభావం ఎలా ఉంటుందో ? రాష్ట్ర జాతీయ మీడియా ప్రతినిధులు వివరాలు సేకరించడం, పోలింగ్ కు ఒకరోజు ముందే ఈ ప్రాంతాల్లో మకాం మేడంతో బహిష్కరణ అంశంకు ఎనలేని ప్రాధాన్యత సంతరించుకునేది. గ్రామాల్లో ఉండి ఓట్లు వేయకుంటే పోలీసులతో ఇబ్బందులు, ఓట్లు వేస్తే నక్సలైట్లతో తిప్పలు వీరిద్దరి మధ్య ప్రజలు, ప్రజా ప్రతినిధులు నరకయాతన అనుభవించేవారు. నక్సల్స్ ఎన్నికల బహిష్కరణ పిలుపు తిప్పి కొట్టడం కోసం పోలీసులు ప్రతి గ్రామము నుంచి నక్సలైట్ల సానుభూతిపరులు అంటూ ముద్ర వేసి కనీసం 20 మంది కి తగ్గకుండా పోలీస్ స్టేషన్లో, పోలీస్ అవుట్ పోస్టులలో వారం పది రోజుల ముందే నిర్బంధించి రాత్రి బయట పడుకోపెట్టేవారు. పోలింగ్ బాక్సులు, సామాగ్రిని, ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలీసు బలగాలను, సిబ్బందిని తరలించే వాహనాల పై భాగంలో ప్రజలకు అగుపించేలా సానుభూతిపరులుగా ముద్ర వేసిన వారిని ‘బస్సు టాప్ ‘ పై కూర్చుండబెట్టి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ లు, బాక్సులను చేరవేసేవారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను జిల్లా కేంద్రానికి తరలిస్తున్న తరుణంలోనూ వీరిని బస్సులపై కూర్చోబెట్టి బాక్స్ ను తరలించేవారు. ఇదిలా ఉండగా పోలింగ్ జరగకుంటే గ్రామ ప్రజాప్రతినిధులకు యువకులకు, పోలీసుల వేధింపులు ఉండేవి. పోలింగ్ జరుగుతే నక్సలైట్లతో ప్రజా కోర్టులో దెబ్బలు ప్రజల పాలిట శాపంగా మారాయి.

250 మంది గ్రామీణులపై టాడా కేసులు!

భయంకరమైన ‘ టాడా ‘. చట్టం ఐలాపూర్ గ్రామంలో నక్సలైట్ల సానుభూతిపరులు అంటూ, కరువు దాడులు చేస్తున్నారంటూ దాదాపు 250. మంది మహిళలు, పురుషులపై నాడు పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన ఉదంతాలు ఉన్నాయి.

కానిస్టేబుల్ కాల్చివేత అనంతరం !

రిజర్వ్ కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని నక్సలైట్లు టార్గెట్ చేసి 1985 లో ధర్మపురి బస్టాండ్ లో కాల్చి హతమార్చారు. నాడు ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్ట కింది దాదాపు 40 గ్రామాల వరకు ఉండేవి.  ధర్మపురి పట్టణంలో పరిసర గ్రామాల్లో 18 సంవత్సరాల పైబడిన యువకులు, మొదలుకొని వృద్ధుల వరకు, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పట్టుకొచ్చి పోలీసులు నక్సలైట్ల సమాచార సేకరణ పేరిట చిత్రహింసలకు గురి చేసేవారు. ధర్మపురి పోలీస్ స్టేషన్ కు దాదాపు ఆరా ఫర్లాంగ్, ప్రహరీ గోడను గ్రామీణ ప్రజలతో ( వెట్టిచాకిరి తో )నాటి ఎస్సై సోమిరెడ్డి పెట్టించాడు. యువకులు ,విద్యార్థులు , 50 సంవత్సరాల లోపు వారు ఉన్న ఊరును, తల్లిదండ్రులను, ఇల్లు వాకిలి వదిలి ధర్మపురి నుండి పారిపోయారు. .దొరికిన వారిని నెలల తరబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి నక్సల్ సమాచారం కోసం చిత్రహింసలకు గురిచేశారు. కానిస్టేబుల్ చనిపోయిన రాత్రి  ధర్మపురి పట్టణానికి చెందిన ఓ యువకుని పోలీసులు కిడ్నాప్ చేశారు. ఎన్కౌంటర్ చేయడం కోసం యువకుడి ని అజ్ఞాత ప్రదేశంలోకి తీసుకొని వెళ్తుండగా యువకుడు చాకచక్యంగా వారి చెర నుంచి అదే రాత్రి తప్పించుకున్నాడు. అడవి మార్గం గుండా  అప్పటి కరీంనగర్ ఎస్పీ అశోక్ ప్రసాద్, వద్దకు ఓ రాజకీయ నాయకుడి, సహకారంతో చేరుకొని పరిస్థితిని వివరించారు. ధర్మపురి పట్టణంతో పాటు, పరిసర గ్రామాల్లో నక్సల్స్ సమాచారం కోసం సానుభూతిపరులైన వారి ఇళ్లపై అర్ధరాత్రి, అపర రాత్రి పోలీసులు మఫ్టీలో దాడి చేసేవారు. వంట సామాన్లలో, కిరోసిన్ కలిపేవారు, ఇంటి పెంకులు తినుబండారాలను బావుల్లో పడవేసేవారు, భయం,భయంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనల నాడు దుర్భర జీవనం కొనసాగించాల్సిన దుస్థితి ఉండేది.