పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానం రద్దు..!

👉 ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.

👉 శిక్షణ లోనే ఓటు వేయాలి!

J.SURENDER KUMAR,

ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు బదులు.. ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓట్ల వినియోగానికి ఎన్నికల నిర్వహణ చట్టం 1961లోని 18వ నిబంధనకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది
ఈమేరకు ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండేలు సూచించారు.

ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సర్వీస్ ఓటర్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవారు ఓటు వేసేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేలా ఈ చట్టం వీలు కల్పిస్తోంది. ఐతే ఇకపై దానిని రద్దుచేసి.. వారంతా ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఓటు వేసేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో ‘పోస్టల్ బ్యాలెట్  పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఓట్ల లెక్కింపు సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లనే లెక్కిస్తారు. ఎన్నికల విధుల్లో ఉండి.. తమ సొంత నియోజకవర్గానికి వెళ్లి.. ఓటు వేయలేని వారు.. పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకుంటారు. ఐతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు స్వస్తి చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం  భావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఇకపై పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా… ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా.. కీలక మార్పులు చేయనుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు గత వారం ప్రతిపాదనలు పంపించినట్లు కేంద్రం ఎన్నికల సంఘం తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగాన్ని తగ్గించి.. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు వెల్లడించింది.


ఐదేళ్లకు ఓసారి జరిగే లోక్‌సభ ఎన్నికల సమయంలో.. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షలకుపైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సుమారు కోటి మంది ఓటర్లు ఎన్నికల విధుల్లో ఉంటారు. పోలీసులు, పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది… సాధారణ ప్రజల్లా ఓటు వేసేందుకు వీలు కాదు. సొంత నియోజకవర్గానికి వెళ్లలేరు. ఐతే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఎన్నికల డ్యూటీలో ఉన్న వారంతా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుంటుంది. అంటే పోస్టు ద్వారా ఓటను పంపిస్తారు.  ఎన్నికల విధుల్లోకి వెళ్లేవారికి శిక్షణా సమయంలోనే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ను అందిస్తారు. అందుకోసం అన్ని ఏర్పాట్లతో ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ అందుబాటులో ఉంటాయి. కానీ చాలా మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను తమతో తీసుకెళ్తున్నారు. కౌంటింగ్‌ రోజు ఉదయం 8 గంటల లోపు రిటర్నింగ్ అధికారికి పంపే వెసులుబాటు ఉండడంతో.. అప్పటి వరకు తమ వద్దే ఉంచుకుంటున్నారు. తద్వారా పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌లోనే.. ఓటు వినియోగించుకునేలా నిబంధనల్లో మార్చు చేయాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది.