J.SURENDER KUMAR,
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.

వరుస సెలవులతో తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. ఇక, శ్రీవారి బ్రహ్మోత్సవాలు..దసరా సెలవులతో ఈ నెల మొత్తం రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో, ఈ నెలలో 1, 7, 8, 14 మరియు 15వ తేదీలలో ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేయకూడదని నిర్ణయించింది.

28 న 8 గంటల పాటు ఆలయం మూసివేత!
ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహణం వేళ శ్రీవారి ఆలయం ఎనిమిది గంటల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
అక్టోబర్ 29 తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం అక్టోబర్ 28 రాత్రి మూసివేసి…29వ తేదీ తెల్లవారుజామున తిరిగి తెరవనున్నారు. అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు.
చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయని అధికారులు వెల్లడించారు. దీని కారణంగా, సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేస్తూ నిర్ణయించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద వున్న పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 36 గంటల సమయం పడుతోంది. దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.