వృద్ధాప్యం శాపం కారాదు …..


👉 ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా..
                       ***

మానవ జీవితంలో చివరి మజిలీ వృద్ధాప్యం. కరోనా విజృంభించిన సమయంలో ఇటలీలో వృద్ధుల పరిస్థితిని మనం కళ్లారా చూశాం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా వారి పరిస్థితి ఇలాగే ఉంది.
ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.

మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయో వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. సీనియర్‌ సిటిజన్‌ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడడం జరిగింది. మొదటిసారిగా 1991, అక్టోబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా పంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.


1990, డిసెంబర్‌ 14న ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ఒక నిర్థిష్ట ప్రణాళికను తయారుచేసి, ప్రపంచ దేశాలన్నీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. ఫలితంగా 1999 సంవత్సరంలో మన దేశంలో వృద్ధుల సంక్షేమానికి ఒక జాతీయ ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఆర్థిక భద్రత, ఆరోగ్య రక్షణ, నివాస వసతి, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు. అయితే అది ఎటువంటి కార్యాచరణకు నోచుకోలేదు.
2004లో స్పెయిన్ దేశంలో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు. మన దేశంలో 60 ఏళ్ళకు మించిన వృద్ధులు దాదాపు 11 కోట్ల మంది ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. మరో 20 ఏళ్ళలో ఈ సంఖ్య రెట్టింపు కాగలదని అంచనా. అనగా మనిషి జీవన పరిమాణం పెరుగుతుంది. ఇది మంచి పరిణామమే. 2050 నాటికి మన దేశ జనాభాలో 20 శాతం మంది వృద్ధులే ఉంటారని అంచనా.
మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు కోటి మందికిపైగా 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు ఉన్నట్లు అంచనా. ఇందులో 25 శాతం మంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్లలో ఉద్యోగాలు చేసి రిటైరయి  నెలనెలా పెన్షన్లు పొందుతూ  బతుకుతున్నారు. మరో 15 శాతం మంది సొంత ఇండ్లతో, నెలనెలా అద్దెలతో వ్యవసాయ భూముల వలన పంటల ఆదాయంతో ఉన్నారు.  ఇంకో 15 శాతం మంది 60 సంవత్సరాలు పైబడినా కూడా వివిధ రకాల వ్యాపారాలు, వర్తకాలు చేస్తూ డబ్బు జీవనోపాది కల్పించు కుంటున్నారు.  మరో 10 శాతం మంది తమ సంతానం సంరక్షణలలో ఉన్నారు. 

మిగిలిన 35 శాతం మంది చాలా ఇబ్బందులలో ఉన్నారని తెలుస్తుంది. సుమారు 25 లక్షల మంది గ్రామాల్లో జీవిస్తు ఆర్థిక, సామాజిక, అనారోగ్య బాధలు పడుతున్నారు.. దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులవారు 60 సంవత్సరాల తర్వాత శరీర సత్తువ తగ్గి సంపాదించుకోలేక పోతున్నారు. వీళ్లకు మరే విధమైన ఆర్థిక వనరులు లేకపోవడం వలన ఆకలితో అలమటిస్తున్నారు. 
సాధారణంగా 60 ఏళ్ళ పైబడిన వాళ్లకు రోగాలు మొదలవుతుంటాయి. దీర్ఘకాల రోగాల బారినపడి ఖరీదైన వైద్యం చేయించలేక ఎంతోమంది శేష జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. ఇక మా బతుకులింతే అని నిరాశా నిస్పృహల తో భారంగా గడుపుతున్నారు.


ప్రస్తుత ప్రభుత్వాలు ప్రతి మండల కేంద్రంలో ఈ వృద్ధులకు ఉచిత వైద్య సహకారం అందించాలి. ఆర్టీసీ బస్సులలో రాయితీ మరింత పెంచాలి, రైల్వేలలో సీనియర్ సిటిజన్స్ కు రాయితీలు పెంచవలసిందిపోయి కరోనా అనంతరం పూర్తిగా రద్దు చేయడం శోచనీయం. వీటిని పునరుద్దరించాలి.  ప్రతి బ్యాంకులో క్యూ తో నిమిత్తం లేకుండా సీనియర్‌ సిటిజన్లకు లావాదేవీలు జరిపే సదుపాయం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఒక మంత్రిని నియమించాలి. సీనియర్‌ సిటిజన్లు ఎదర్కొంటున్న సామాజిక బాధలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలి.

అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ఉచిత వైద్య సహాయం అందచేయాలి
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, పోలీస్‌ స్టేషన్‌లో వృద్ధులను గౌరవించడం మన బాధ్యత అనే బోర్డులను ఏర్పాటు చేయాలి.  వీటన్నిటి సాధనకు సీనియర్‌ సిటిజన్లందరూ సంఘాలలో సభ్యులై ‘మన కోసం మనమే’ అనే సిద్ధాంతంతో శేష జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. వృద్ధులు  అవస్థలు పడకుండా అలమటించి పోకుండా చూసే బాధ్యత యువతకు, ప్రభుత్వానికి వుంది. వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం మన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 21ని ‘జాతీయ వృద్ధుల దినోత్సవం’గా ప్రకటించింది. 2007లో తల్లిదండ్రులు, పెద్దల పోషణకు సంక్షేమ చట్టం చేసింది.
జీవిత చక్రంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం.మానవులు ప్రతి దశలోనూ ఆనందంగా గడపాలని అభిలషిస్తారు. పుట్టి, పెరిగి, బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. వారసులకు ఓ బాట చూపించి.. మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెబుతూ గడిపే సమయం వృద్దాప్యం.  మనం మనసమాజం  60 ఏళ్ళ దాటినవారిని  సీనియర్ సిటిజన్ల ముద్రవేసి వారిని  పట్టించు కోవడంలేదు. మనం ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము. కానీ చాలా దేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసు కుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలను  సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు.
ప్రతీ వృద్ధుని దగ్గర తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవజ్ఞానం ఉంటుంది. వారి యొక్క అనుభవాలను  అవగాహన చేసుకొని సరైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది
.

వ్యాసకర్త: 
యం.రాం ప్రదీప్, జేవివి సభ్యులు, తిరువూరు
మొబైల్ నెంబర్ : 9492712836