దళిత ..వీరనారి ఝల్కారీబాయి !

👉నేడు ఝల్కారీబాయి జయంతి సందర్భంగా..

J.SURENDER KUMAR,

స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని, చరిత్రలో రికార్డ్ అవకుండా కాలగర్భంలో కలిసిపోయిన మహోన్నత వ్యక్తులెందరో ఉన్నారు. అలాంటి అపురూమైన, విలక్షణమైన చరిత్ర కలిగిన వారిలో వీరనారిఝల్కారిబాయి ఒకరు. ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత  వీరనారి ఝల్కారీ బాయి.

ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటుకు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిషు సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ దీనికి భారతదేశంలో మెజారిటీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం తరువాత సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణచివేతకు గురైన ఒక వర్గం మాత్రమే బ్రిటిషు ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో  ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’ గా ప్రసిద్ధిగాంచిన 1857 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత  ఈమెది.


బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం. ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో  నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్‌ 22న  ఝల్కారిబాయి జన్మించారు. ఝల్‌కారీ తల్లిదండ్రులకు ఒక్కరే కుమార్తె
చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న తనపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనంరేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను ఝల్కారిబాయి వివాహం చేసుకున్నారు . తన భర్త దగ్గర సైనిక విద్యలన్నీ నేర్చుకుంది. విలువిద్య, కత్తిసాము, తుపాకీ పేల్చటం, దానితోపాటు గుర్రపుస్వారీలో కూడా నిష్ణాతురాలు అయ్యారు.


పెద్ద పెద్ద గుర్రాలను కూడా వశ పరుచుకోవటం ఎలానో నేర్చుకున్నారు. కత్తిని దగ్గరనుండి విసరటం, దూరంలో ఉండి గాలిలో ఎగరేస్తూ కత్తిని విసరటంలో తనకు సాటిలేరు అన్నట్టుగా నేర్చుకున్నారు.
శత్రువుల బాణాలనుండితప్పించుకోవటం, వారిమీద వెంటనే తిరుగుబాటు చేయటం కూడా ఆమెబాగానేర్చుకున్నారు. లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించారు.
సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1858 ఏప్రిల్‌ 3న బ్రిటిష్‌ జనరల్‌ హగ్‌ రోజ్‌ నాయకత్వంలో బ్రిటిష్‌ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్‌ సేనలను ముప్పుతిప్పలు పెట్టారు. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్‌ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా ?  లేదా చంపేశారా ? అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. తర్వాత కాలంలో భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి ఆమె జ్ఞాపకార్థం పోస్టల్‌ స్టాంపును విడుదల చేయడం విశేషం. ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి,నేటి తరానికి ఆమె గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది.

వ్యాసకర్త : యం.రాం ప్రదీప్, జేవివి సభ్యులు, తిరువూరు, 9492712836