ముక్కుసూటి మనిషి బిపిన్ చంద్ర పాల్ !

👉 నవంబర్ 7 ఆయన జయంతి !

ప్రతిఘటనకు పిడిగుద్దులు తప్ప సహాయ నిరాకరణ వంటి మధ్యేమార్గాలు ఉండకూడదన్నారు, బిపిన్ చంద్ర పాల్. అందుకే ఆయన ‘ఫాదర్‌ ఆఫ్‌ రివల్యూషనరీ థాట్స్‌’ గా ప్రఖ్యాతిగాంచారు. ‘పూర్ణ స్వరాజ్యం’, ‘స్వదేశీ ఉద్యమం’, ‘విదేశీ వస్తువుల బహిష్కరణ’… పోరాటం ఏదైనా సరే,తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే స్వభావం ఆయనది. 1858 నవంబర్ 7న నాటి బెంగాల్‌లోని సిల్హట్‌లో గ్రామం లో (నేటి బంగ్లాదేశ్‌) బిపిన్ చంద్ర పాల్ జన్మించారు.

బ్రహ్మసమాజంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసకుడిగా పేరొందారు. వందేమాతరం ఉద్యమ వ్యాప్తిలో భాగంగా రాజమండ్రిలో ఈయన ప్రసంగించిన ప్రాంతాన్ని ‘పాల్‌ చౌక్‌’ అని పిలుస్తున్నారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈయన ఉపన్యాసాల ప్రభావంతోనే ఏర్పాటు చేయబడింది.
ట్రిబ్యూన్‌, న్యూ ఇండియా, వందేమాతరం మొదలైన పత్రికల్లో ఈయన రచనలు ఎన్నో ప్రచురింప బడినాయి. గాంధీజీతో విభేదించిన కారణంగా ఈయనకు తగిన గుర్తింపు రాలేదంటారు. ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ అనే నాయక త్రయాన్ని ‘లాల్‌, బాల్‌, పాల్‌’ అని సగౌరవంగా పిలిచేవారు.
జాతీయోద్యమ పత్రిక , వందే మాతరం పత్రికలను మొదలు పెట్టి, ఆ పత్రికలలో అరబిందో వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడీయన. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించారు. బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడారు.
సినీ రచయిత, దర్శకుడు, ‘బాంబే టాకీస్‌’ వ్యవస్థాపకులలో ఒకరైన నిరంజన్‌ పాల్‌ ఈయన కుమారుడే. విమర్శించవలసిన సందర్భంలో ఎవరైనా మృదువుగా విమర్శిస్తూ ముక్కుసూటి మనిషిగా పేరు పొందారు.ఆయన 1932 మే 20 న తుదిశ్వాస విడిచారు.


వ్యాసకర్త : యం.రాం ప్రదీప్ జేవివి సభ్యులు, తిరువూరు, ఫోన్ 9492712836