నాకు వచ్చిన పేరే ఆకాశమంత పెద్దది..దానికి మించిన పదవి ఉందా! – కెసిఆర్

J.SURENDER KUMAR,

నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది. దానికి మించిన పదవి ఉన్నదా? అయినా ప్రజలు మన్నించారు అందుకే నేను రెండు సార్లు ముఖ్యమంత్రి అయి పదేళ్లు పూర్తవుతుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.
జగిత్యాలలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతిని వివరిస్తూనే కాంగ్రెస్​ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ మాటల లో…

నా అంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రులు కూడా ఎవరు లేరు. ఈ కీర్తి నాకు చాలు. నేను కొట్లాడే ది ఇవాళ నా పదవి కోసం కాదు. కచ్చితంగా తెలంగాణ నూటికి నూరు శాతం పేదరికం లేని రాష్ట్రంగా అవతరించాలన్నది నా పంతం అన్నారు.
రాష్ట్రంలో పదేళ్ల పాలనలో జరిగిన బీఆర్ఎస్ అభివృద్ధిని.. గత 50 ఏళ్ల కాంగ్రెస్ ఘోరమైన పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకొని ఓటు వేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రగతికి పదేళ్లు కావొస్తోందని.. ఈ దశాబ్ద కాలంలో భారత రాష్ట్ర సమితి అందించిన సంక్షేమాలను చూసి ప్రజలు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
స్థానిక నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ నుడాక్టర్ సంజయ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని పునరుద్ఘాటించారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని.. నాడు ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడిన దాఖలాలు లేవన్నారు. ఆ ఇందిరమ్మ రాజ్యంలోనే కదా అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను ఇబ్బంది పెట్టింది అని కేసీఆర్ విమర్శించారు.
అటువంటి పరిస్థితులు మళ్లీ రాష్ట్రానికి కావాలా?  అని ప్రశ్నించారు. సంపద పెరిగే కొద్దీ ప్రజలకు పంచుతున్నామన్న  కేసీఆర్‌.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ ముందే ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌  హయాంలో నీటిపై పన్ను ఉండేదని.. ప్రస్తుతం రద్దు చేశామని తెలిపారు. దేశంలో నీటి పన్ను లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.
రైతుబంధు దుబారా అని కొందరు.. రైతులకు 24 గంటలు విద్యుత్‌ ఇవ్వడం వృథా అని మరికొందరు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. 24 గంటల విద్యుత్‌, రైతుబంధు దుబారానా అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణలో రైతు రాజ్యం ఉందని.. కాంగ్రెస్‌ వస్తే రైతులకు  ఉరి పడటం గ్యారంటీ అని కేసీఆర్ హెచ్చరించారు.
ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్‌ అంటున్నారని.. దాని స్థానంలో భూమాత తెస్తామన్నారు. కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు.. భూమేత అంటూ కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలుదారుల చట్టం తెస్తామని.. రైతుబంధు కౌలుదారులకే ఇస్తామని అంటుందన్నారు. దానివల్ల కౌలుదారు రెండు, మూడేళ్లు సాగు చేస్తే రైతు భూమి గోల్‌మాల్‌ అవుతుందని ఆక్షేపించారు.
మళ్లీ రైతులు తమ భూమి కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతులు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. పదేళ్లు తాను పడిన కష్టం వృథా అవుతోందని కేసీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని హితవు పలికారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తోందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.