👉నేడు జాతీయ పత్రికా దినోత్సవం …
***ఏదేని దేశంలో ప్రజాస్వామ్యము సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము కొనసాగుతున్నదంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలన, చట్టబద్ద పాలన కొనసాగుతున్నట్టే అని భావించాల్సి వస్తుంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు.1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా (నేషనల్ ప్రెస్ డే) దినోత్సవాన్ని జరుపుకుంటారు.
వివిధ సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం పెంచడానికి పత్రికలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పత్రికలు కీలక పాత్ర పోషించాయి.ఇప్పుడు ఆ పాత్రను సోషల్ మీడియా పోషిస్తుంది.

తొలి పత్రిక!
దేశంలో బెంగాల్ గెజిట్ తొలి పత్రికగా పేరు పొందింది.1835లో బళ్ళారి కేంద్రంగా మద్రాసులో ప్రచురించబడిన ‘ ‘సత్యదూత’ మాసపత్రిక తొలి తెలుగు పత్రిక. ఆ తరువాత ‘ హితవాది’ అనే వారపత్రిక ప్రచురించబడింది. కాకినాడ నుండి కెనడియన్ బాప్టిస్టు మిషన్ ప్రచురించిన’ రావి’ అనే పత్రికలో మతవిషయాలతో పాటు వార్తలు వుండేవి. సామాజిక, భాషాభివృద్ధి ధ్యేయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నడిపిన వివేకవర్ధని వార పత్రిక, దానితో పోటీగా వేంకటరత్నం పంతులు పంతులు నడిపిన ‘ఆంధ్ర భాషా సంజీవిని’ తొలి అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు.
ప్రెస్ కౌన్సిల్ పత్రికారంగాన్ని పరిశీలించటంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించటం, అభిశంసించటం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది.

ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలకు అవార్డులను అందచేస్తున్నది. పత్రికా స్వేఛ్చకు అనేక దేశాలలో ముప్పు వచ్చిన తరుణంలో 1997లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో పత్రికా రంగం బాగా దెబ్బతింది. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే పత్రికలు స్వతంత్రంగా పని చేయాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త: యం. రాం ప్రదీప్ జేవివి సభ్యులు,
తిరువూరు, ఫోన్ : 9492712836