రైతుబంధు పంపిణీ అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది !

👉 మంత్రి హరీష్ రావు, నియమాలు ఉల్లంఘించారని..

J.SURENDER KUMAR

కేంద్ర ఎన్నికల సంఘం  కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధు నిధులు విడుదలకు  అనుమతిని ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం   తాజాగా ఉపసంహరించుకుంది.
నియమాలు ఉల్లంఘించారని అందుకే అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రచార సభల పై రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. అదేవిధంగా ఎన్నికల్లో లబ్ధిపొందేలా వ్యాఖ్యలు చేయరాదని సీఈసీ ముందే షరతు విధించింది.
అయితే రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు  వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. అందుకే అనుమతిని ఉపసంహరించుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
 రైతుబంధు  నిధుల విడుదలకు.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు ఇలా అనుమతి ఇవ్వడంపై.. రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఇలా చేయడం ఓటర్లను ప్రలోభానికి గురి చేయడం లాంటిదేనని ధ్వజమెత్తాయి. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అనడానికి ఇదే నిదర్శనమంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం  కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధు నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని.. తాజాగా ఉపసంహరించుకుంది.
తెలంగాణలో యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి.. సీఈసీ శుక్రవారం రాత్రి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు ఐదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి ₹5,000ల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం ₹10,000లను అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.
 తెలంగాణలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌  ఆరంభానికి ముందు.. రాష్ట్ర సర్కార్‌ రైతుబంధు నిధులు విడుదల చేస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. ఇది కొనసాగుతున్న పథకమని కోడ్‌ వర్తించదని.. యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం గత నెలలో సీఈసీని కోరుతూ లేఖ రాసింది. పరిశీలించిన ఈసీ మూడు రోజుల క్రితం నిధుల జమకు అనుమతులు ఇచ్చింది. 28 సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తున్నందున.. అప్పటి నుంచి ఈ నెల 30న పోలింగ్‌ ముగిసే వరకు నిధులను జమ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ అనుమతిని సీఈసీ ఉపసంహరించుకుంది.