షాడో టీమ్ లతో ఎమ్మెల్యే అభ్యర్థులకు సమస్యలు తప్పవా ?

J.SURENDER KUMAR,

శాసన సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు భవిష్యత్తులో షాడో టీమ్ లతో సమస్యలు తప్పవు అనే చర్చ మేధావి వర్గంలో నెలకొంది.

రాష్ట్రంలో జరిగిన హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బులు, వివిధ రకాలైన కానుకలతో, మద్యంతో ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేయడం, తదితర సంఘటనలను కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ తీసుకొని ఇలాంటి సంఘటనలకు నియంత్రణతో పాటు భవిష్యత్తులోనూ పునరావృతం కాకుండా పక్కా కార్యాచరణ ప్రణాళిక శ్రీకారం చుట్టింది.


24/7 షాడో టీమ్ లు !

కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ షాడో టీమ్ లు నిర్వహించాలని ఆయా జిల్లాలో ఎన్నికల ప్రధాన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల పర్యటన, సభలు సమావేశాలను, వెన్నంటి ఉండి వీడియో రికార్డింగ్ తో పాటు ఫోటోగ్రఫీ, వివరాలు నమోదు చేస్తూ ఆన్ లైన్ లో ఎన్ని జెండాలు ? ఎన్ని వాహనాలు? వేదిక పొడవు వెడల్పు, సబికులకు భోజనాలు, శాఖాహారమా ?మాంసాహారమా ? జిల్లా ఎన్నికల సంఘానికి నివేదికలు పంపించాలి.

షిఫ్ట్ పద్ధతిలో నలుగురు సభ్యులు గల బృందం 24 గంటల పాటు అభ్యర్థుల కదలికలను ఎన్నికల సంఘానికి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఏఈఆర్ఒ, ఎంసిసి, ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టీ, టీమ్ సభ్యులు అనుమతులు లేనీ వాహనాల ప్రచారం, ఎంసిఎంసి అనుమతులు లేనీ కరపత్రాలు, ఫ్లెక్సీలు, స్టిక్కర్లు ప్రచారంలో పంపిణీ వివరాలను నమోదు చేసి నివేదికలు పంపించడం వారి విధుల్లో ఒకటి. ప్రచారంలో వినియోగిస్తున్న వీడియో, ఆడియో క్లిప్పులని మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకున్నారా ? లేదా ? మద్యం, డబ్బు అక్రమ రవాణా జరుగకుండా నియంత్రణ , పోలీసులకు సమాచారం ఇవ్వడం వీరి వీధి.
ఎన్నికల సంఘానికి అభ్యర్థుల సమర్పించిన ఖర్చుల వివరాలు, షాడో టీమ్ ల నివేదికలలో వ్యత్యాసం ఉండి ఉంటే సమస్యలు తప్పవనే చర్చ నెలకొంది
.