👉 నవంబర్ 11 ఆజాద్ జయంతి
భారత స్వాతంత్ర్యం కోసం పరితపించిన వ్యక్తిగా, మత ప్రాతిపదికన భారతదేశం విడిపోవటాన్ని వ్యతిరేకించిన నిజమైన భారతీయునిగా, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సాహిత్యం, విద్యా వికాసాలకొరకు కృషి చేసిన వ్యక్తిగా, దేశభక్తికి మతాలు అడ్డురావని నిరూపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్.
సౌదీ అరేబియా దేశంలోని ‘మక్కా’ లో 1888 నవంబర్ 11న మౌలానా అబుల్ కలామ్ జన్మించారు.
మహమ్మదీయ సాంప్రదాయ పద్దతిలో విద్యాభ్యాసం జరిపినప్పటికి మౌలానా రహస్యంగా ఆంగ్లం కూడా నేర్చుకున్నారు. ఇస్లామిక్ సాంప్రదాయ పద్దతిలో పెరిగినప్పటికీ, విద్యాభ్యాసం చేసినప్పటికీ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఏనాడూమతమౌఢ్యానికి లోనౌలేదు.

‘ముస్లింలీగ్’ పార్టీ మొత్తం ముస్లింలందరికీ ప్రాతినిధ్యం వహిస్తోందన్న అపవాదును తుడిచివేయడానికి మౌలానా ‘నేషనలిస్ట్ ముస్లిం లీగ్’ పార్టీని కాంగ్రెస్‌లో అంతర్భాగంగా స్ధాపించారు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా 10 సంవత్సరాల పాటు బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన మౌలానా ఆజాద్ ను నెహ్రూ ‘సంస్కృతి’ ధైర్యాలకు ప్రతీక కీర్తించారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ని మౌలానా ఆజాద్ స్ధాపించారు. అదే విధంగా అప్పటి భారత ప్రధాని జవహరలాల్ నెహ్రూ ఆధ్యర్యంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐ. ఐ .టిలను కూడా స్థాపించారు. అటు విద్యారంగంలో శాస్త్ర, సాంకేతిక, స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేస్తూనే, ఇటుకళారంగంలో తన ఆసక్తిని ప్రదర్శించారు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్. సంగీత, సాహిత్యాలను అమితంగా అభిమానించే మౌలానా అబుల్‌కలామ్ ఆజాద్ ‘సాహిత్య అకాడమీ’, ‘సంగీత నాటిక అకాడమీ’, ‘లలిత కళా అకాడమీ’ లను స్ధాపించారు. ‘లలితకళా అకాడమీ’ ను స్ధాపించినపుడు దానికి భవనం లేకపోవటంతో తన నివాసంలో కొంత భాగాన్నిచ్చారు. మౌలానా అబుల్ కలామ్ రచించిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకంలో భారతదేశ విభజన గురించి రాశారు. 1958 ఫిబ్రవరి 22న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆజాద్ కి మరణానంతరం 1992 లో భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారo భారతరత్న లభించింది.ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుతారు.
వ్యాసకర్త: యం.రాం ప్రదీప్,జేవివి సభ్యులు
తిరువూరు, ఫోన్ నెంబర్ ! 9492712836