సీఎం గా రేవంత్ రెడ్డి…జడ్పీటీసీ నుంచి సీఎం పదవి వరకు !

👉డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం..

👉మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలు..

👉రేవంత్ రెడ్డి అతడే ఓ సైన్యం ..సంచలనం !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి గా  గురువారం ( ఈనెల 7న) బాధ్యతలు చేపట్టనున్నరు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌ రెడ్డి, తన రాజకీయ ప్రస్థానం జెడ్పిటిసి పదవి నుంచి ప్రారంభించారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో సంచలనం. భవిష్యత్‌ నాయకులకు అతనో మార్గదర్శకం. ఆటుపోట్లకు అదరలేదు. వైఫల్యాలకు కుంగలేదు. వెన్నుచూపని వీరత్వంతో అపజయాలనే అనుభవాలుగా, పోరాటాలనే వారధిగా చేసుకొని అనతి కాలంలోనే అశేష జనాదరణ పొందాడు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ప్రస్తానం మొదలుపెట్టి, 15 ఏళ్లలోనే రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ధీరత్వం, గుక్క తిప్పుకోని ప్రసంగాలతో మంత్రముగ్ధుల్ని చేసే చాతుర్యం, ఆవేశపూరిత వాగ్బాణాలతో యువతను ఉర్రూతలూగించగలిగే నాయకత్వం, ఆటుపోట్లకు వెన్ను చూపకుండా ఎదురొడ్డి నిలిచిన వీరత్వం, పార్టీలో చేరి పదేళ్లు కాకున్నా కాకలు తీరిన నేతలతో సాధ్యపడని లక్ష్యాన్ని ముద్దాడి శతాధిక పార్టీని అధికారంలోకి తెచ్చిన నేత. అలుపెరగని పోరాటంతో అనధి కాలంలోనే అగ్రనేతగా ఎదిగి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు అనుముల రేవంత్‌ రెడ్డి


అతడే ఒక సైన్యం


గెలుపు తీరాలకు కాంగ్రెస్ పార్టీని చేర్చిన ధీరుడు, కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్​ రెడ్డి రాకముందు ఒక లెక్క, రేవంత్ వచ్చిన తర్వాత ఒక లెక్క. నిత్యం గొడవలు, పార్టీ ఫిరాయింపుల తో నిద్రావస్తలో ఉన్న పార్టీని తనదైన శైలిలో పైకి లేపి, అన్నీ తానై అధికారంలోకి వచ్చే విధంగా తీసుకువచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి, తన మౌన వ్యూహాలతో బదిలిస్తూ సమాధానం చెప్పారు. తనకంటూ ఒక మాస్ పాలోయింగ్​ను ఏర్పాటు చేసుకొని విమర్శలు, స్వపక్షం నుంచే వ్యతిరేకత, కేసులు వంటి ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడిన గొప్ప ధీరుడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​కు పదేళ్ల పాటు జరిగిన పరాభవాన్ని ఈ ఎన్నికలో గెలుపుతో తుడిచిపెట్టేశాడు రేవంత్​రెడ్డి.

👉నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబరు 8న అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్‌ రెడ్డి జన్మించారు.

👉 వనపర్తిలో పాలిటెక్నిక్‌ చేసిన ఆయన కాలేజీలో చదువుకునే సమయంలో విద్యార్థి సంఘంలో చురుగ్గా ఉండేవారు.

👉2002లో టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆర్‌ఎస్‌)లో చేరి కొంతకాలమే ఆ పార్టీలో కొనసాగారు. తదనంతర కాలంలో జడ్పీటీసీగా పోటీ చేసి 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ మండలంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా గెలుపొందిన రేవంత్‌ ఆరంభంలోనే సత్తా చాటారు.

👉2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రేవంత్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌లో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించి, రాజకీయ పార్టీల దృష్టిని తనవైపు తిప్పుకోగలిగారు.

👉2008లో టీడీపీలో చేరిన రేవంత్‌ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గురునాథ్‌ రెడ్డిపై 6 వేల 989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

👉ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో 14 వేల 614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలోనే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నేతగా ఉండి అసెంబ్లీలో అప్పటి అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడారు.

👉రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి 2017లో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన నాయకత్వ పటిమ, వాక్చాతుర్యం, జనాదరణ గుర్తించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది.

👉 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే 2019 మే నెలలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

👉ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 2 సార్లు ఘోర పరాజయం, స్థానిక సంస్థల్లో వైఫల్యాలు, నాయకత్వలేమి, వరుస పరాభవాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో 2021 జూన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలను రేవంత్‌ రెడ్డి చేపట్టారు. సీనియర్లు వ్యతిరేకిస్తున్నా అధిష్ఠానం మాత్రం ఆయనకే పగ్గాలిచ్చేందుకు మొగ్గు చూపింది. నాటి నుంచి ఎంతో మంది పార్టీని వీడినా, వైఫల్యాలు వెంటాడుతున్నా, నాయకులు సహకరించుకున్నా అధికార బీఆర్‌ఎస్‌కు ఎదురొడ్డి పోరాడారు రేవంత్‌ రెడ్డి.

👉శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చటంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం. రాష్ట్రవ్యాప్తంగా 80కి పైగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొని, విస్తృత ప్రచారం చేశారు. ప్రచార సభల్లో రేవంత్‌ ప్రసంగాలు జనాన్ని ఊర్రూతలూగించాయి.


అధిష్ఠానం ఆదేశాలతో పార్టీ నేతలందరినీ కలుపుకెళ్తూ బీఆర్‌ఎస్‌ను గద్దె దించి, పూర్తి ఆధిక్యతతో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పాటులో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నిర్వర్తించిన బాధ్యత కాంగ్రెస్‌ చరిత్రలో నిలిచిపోతుందనటంలో సందేహం లేదు.