సీఎం కేసీఆర్ రాజీనామా ఆమోదం!

👉ప్రకటన జారీ చేసిన రాజభవన్!


J.SURENDER KUMAR,

 బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా  చేశారు. ఇందులో భాగంగానే ఆయన రాజ్‌భవన్‌లో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు తన రాజీనామా లేఖను పంపారు.  కేసీఆర్ విజ్ఞప్తి మేరకు  గవర్నర్  రాజీనామా ను ఆమోదించినట్టు రాజ్ భవన్ ఆదివారం రాత్రి ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సాయంత్రం ఐదున్నరకు గవర్నర్ సమయం తీసుకున్నారు. ఆ సమయం కంటె ముందే సీఎంఓ నుంచి కేసీఆర్ రాజీనామా లేఖ రాజ్ భవన్‌కు చేరింది. స్పెషల్ మెసెంజర్ ద్వారా రాజీనామా లేఖను రాజ్ భవన్‌కు పంపారు. గవర్నర్ తమిళిసై కేసీఆర్ రాజీనామాను ఆమోదించారు.

సీఎం కేసీఆర్ ఎలాంటి కాన్వాయ్ లేకుండా వ్యక్తిగత వాహనాల్లో ప్రగతిభవన్ నుంచి ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమైన రోజే రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 అక్టోబర్ ఆరో తేదీన శాసనసభ రద్దు చేయడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘనవిజయంతో 2018 డిసెంబర్ 13వ తేదీన కేసీఆర్ రెండోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీలోకి దిగారు. అయితే గజ్వేల్‌లో కేసీఆర్ ఈసారి కూడా విజయఢంకా మోగించారు. కేసీఆర్ 2014, 2018లో గజ్వేల్‌ నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఆ రెండు సార్లు విజయకేతనం ఎగరవేశారు. ఇక అప్పటి నుంచి సీఎంగా కొనసాగిన ఆయన తన సొంత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాగించారు. మరోవైపు కామారెడ్డిలో మాత్రం బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట్రమణారెడ్డి చేతిలో సీఎం కేసీఆర్. ఓడిపోయారు.