👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచిన సంగతి తెలిసిందేననీ… ఈ సందర్భంలో శనివారం రెండు పథకాలను అమల్లోకి తీసుకువచ్చిందని పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర మహిళలకు మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల పెంచే మరో పథకాన్ని జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా, ఆర్టీసి రీజనల్ మేనేజర్ తో కలిసి జండా ఊపి ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం కింద బస్సులో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ జారీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…
ఈ పథకం కింద ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించాలనుకునే మహిళలు రాష్ట్రంలో నివసిస్తున్నట్లుగా చిరునామాను పేర్కొంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే వివిధ గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుందన్నారు.

ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం అమలుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తిగావించిందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఈ సందర్భంగా వివరించారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షలకు పెంచే మరో పథకాన్ని కూడా ప్రారంభించారు. మొట్టమొదటగా ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుపై రెండు రోజుల్లోనే రెండు పథకాలకు శ్రీకారం చుట్టడం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం….మహాలక్ష్మి పథకం తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి గాను జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి డిపోల బస్సులను సుందరంగా తీర్చిదిద్ది, పట్టణంలోని ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టిసి రీజనల్ మేనేజర్ సుచరిత, డిపో మేనేజర్ లు, సిబ్బంది, జిల్లా అధికారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.