కాంగ్రెస్ లో చేరడానికి కష్టపడుతున్నారు..

👉మొక్కని వారు లేరు ఎక్కని గడప లేదు!

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజులు కాకముందే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అష్ట కష్టాలు పడుతున్నట్లు సమాచారం.

తమకు కనబడిన కాంగ్రెస్ కీలక నాయకులను మొక్కడం, వారి ఇంటి గడప ఎక్కడం, దిగడం తో గత కొన్ని రోజులుగా కష్టాలు పడుతున్నట్టు సమాచారం.
జగిత్యాల జిల్లా కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ సాధించాడు. దీంతోపాటు, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజభోగాలు అనుభవిస్తూ, పదవులను పొంది, ఆడింది ఆటగా, పాడింది పాటగా నియోజకవర్గంలో చలామణి అయిన కొందరు చోట మోట నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధుత్వ వివరాలను, తోక చుట్టాల నాయకుల అడ్రస్సులు తెలుసుకొని వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. మరికొందరు నాయకులు తమ, తుమ సామాజిక వర్గ, కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుల వద్దకు వెళ్లి పార్టీలో చేరడం కై తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు వీరితో మాట్లాడుతూ ‘మీరు ఎందుకు తొందరపడుతున్నారు, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల వరకు ఆగండి, మీ అవసరం వాళ్లకే ఉంటుంది. ఇప్పుడు చేరడానికి ప్రయత్నిస్తే మీ అవసరం కోసం చేరినట్టు ఉంటుంది’ అని హితవు చెప్పినట్టు సమాచారం .
ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నిస్తున్న చోట మోట నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ వేధించడం, పోలీస్ కేసులు పెట్టడం, తమ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకపోవడం, తదితర అవమానాలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వారితో మాట్లాడుతూ కొందరు ఎన్నికల సందర్భంలో మన పార్టీలోకి చేరడానికి వస్తే తిరస్కరించిన విషయం వారికి వివరిస్తూ, ఇప్పుడు వాళ్లుకు అధికార పార్టీలో చేరడం అవసరం, మనకు వాళ్ళ అవసరం లేదని, నాయకుల, కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి, అనవసరంగా ఇలాంటి పుకార్లు నమ్మవద్దు అంటూ పార్టీ క్యాడర్ కు ఎమ్మెల్యే చెప్పినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ లో చేరిక ప్రయత్నాలు అంటూ ప్రచారం చేస్తూ బీజేపీలో. ప్రముఖ నాయకులతో వీరు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.