J. SURENDER KUMAR,
ధర్మపురి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన అడ్లురి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే హోదాలో సోమవారం మొదటిసారి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యేకు పూలమాలవేసి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతించారు. స్వామివారి దర్శనానంతరం ఆశీర్వచ మండపంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ ఐ .రామయ్య, ఎమ్మెల్యేకు స్వామి వారి శేషాస్త్రం ప్రసాదం అందించారు.

ఈ నెల 3న విజయం సాధించిన లక్ష్మణ్ కుమార్, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక తదితర కార్యక్రమాలతో బిజీగా ఉన్న లక్ష్మణ్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గా నియమించడం తెలిసిందే.

అసెంబ్లీ సెలవుల నేపథ్యంలో ధర్మపురి క్యాంప్ లో ప్రభుత్వ కార్యక్రమాలలో గత 15 రోజులుగా ప్రత్యక్షంగా, జోక్యం చేసుకోలేదు. మొదటిసారి స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 23న జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తజనం తరలిరానున్నారు..

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు చేపడుతున్న ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఎమ్మెల్యే ఆలయ, పోలీస్, రెవెన్యూ, స్థానిక మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో చర్చించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, కమిషనర్ రమేష్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, వేద పండితులు రమేష్ శర్మ, ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాస్, డిఎస్పి వెంకటస్వామి, సిఐ రమణమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.