J.SURENDER KUMAR,
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరో.. అని ఏ కవి రాశాడో ఆ. అక్షరాలు అక్షర సత్యంగా అగుపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, ప్రతిపక్షంలో ఉన్న నాయకులను ముందస్తుగా పోలీసులు, పోలీసు అధికారులు అరెస్టులు చేయడం, గత కొన్ని రోజులు క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోలీసులు అరెస్టు చేసిన ఓ నాయకుడు అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రజా ప్రతినిధిగా చట్టసభలకు ( ఎమ్మెల్యేగా) ఎన్నికయ్యారు. ఎ నాయకుడిని బలవంతంగా పోలీసులు అరెస్టులు చేశారో, ఆ పోలీస్ లు, అధికారులు అతడికి సెల్యూట్ కొడుతూ పూల బొకే అందిస్తూ, శాలువాలు కప్పి సన్మానిస్తున్నారు.

ఇది ప్రోటోకాల్ ప్రకారం లేదా పోలీసు విధులలో భాగం కావచ్చు. కాకపోవచ్చు కానీ ‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు ‘ అని కర్ణాటక మాజీ సీఎం స్వర్గీయ దేవరాజు అర్స్ కొన్ని దశాబ్దాల క్రితం అన్నారు. ప్రస్తుతం పోలీసులకు సైతం ప్రతిపక్ష నాయకుల పై వ్యక్తిగతంగా కోపం ఉండదని, విధి నిర్వహణలో పై అధికారుల ఆదేశాల మేరకే నిర్బంధాలు, అరెస్టులు చేస్తారు కాబోలు అని మనం అనుకోవాల్సిందే. ఈ ఉదంతాలు ఉపోద్ఘాతం ఎందుకంటే….

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, ప్రస్తుతం ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తాగునీటి, సాగునీటి సమస్యలపై, వడ్లు కొనుగోలు జాప్యం, నిర్బంధంగా ఆరు కిలోల వడ్లను తరుగు తీయడం తదితరు అంశాలపై, ఇత్తనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిరసనగా గ్రామ ప్రజలతో, రైతులతో ఆందోళనలు, జిల్లాలో తదితర.ప్రజా సమస్యలపై పార్టీ పరంగా ఆందోళన చేశారు. జిల్లాలో మంత్రి పర్యటన గాని, బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గాని, జిల్లా పోలీస్ యంత్రాంగం లక్ష్మణ్ కుమార్ ను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముందస్తుగా రాత్రి వేళలో లేదా

తెల్లవారుజామున అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ లలో సాయంత్రం వరకు నిర్భందించేవారు. లక్ష్మణ్ కుమార్ ను గృహ నిర్బంధం, లేదా బలవంతంగా అదుపులో తీసుకొని మరో మండల పోలీస్ స్టేషన్ కు తరలించడం. తదితర పోలీస్ యంత్రాంగం చర్యలు గత మూడు సంవత్సరాలు షరా మామూలు గా కొనసాగేవి.

మండలాల్లో ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో పాటు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, మహిళా కౌన్సిలర్లు, నాయకులు తాగునీటి సమస్యపై వీధి కుక్కల. నియంత్రణ అంశంపై కానీ నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండేది కాదు. నిరసన తెలుపకుండా పోలీసులు అడ్డుకునీ అదుపులో తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో తాసిల్దార్ ముందు బైండ్ ఓవర్ చేసేవారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతోపాటు, లక్ష్మణ్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో, విధి లేకనో, విధి నిర్వహణలో భాగము తెలియదు కానీ కొందరు పోలీసు అధికారులు ఎమ్మెల్యే తో ప్రవర్తిస్తున్న తీరు పలువురికి చిత్ర విచిత్రంగా అగుపిస్తున్నది.