నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి (NIA) మోస్ట్ వాంటెడ్ ముగ్గురు యువకులు !

👉జగిత్యాల కు చెందిన అబ్దుల్ సలీం ఒక్కరు..

J.SURENDER KUMAR,

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ ( నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దూకుడు పెంచింది.  వారి మోస్ట్​ వాంటెడ్​ జాబితాలో ముగ్గురు తెలుగు యువకులు ఉన్నారు. జగిత్యాల కు చెందిన అబ్దుల్ సలీం ఒక్కడు ఉన్నారు.


జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్ కు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్​లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ ఆహద్, అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఖాజానగర్​కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్​లను  ఎన్ఐఏ వాటెండ్ జాబితాలో చేర్చింది.
నిషేధిత పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యకలాపాల దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్​ఐఏ పలువురిని అరెస్టు చేయగా, తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను మోస్ట్ వాంటెడ్​  జాబితాలో చేర్చి విచారణ చేస్తుంది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో యాక్టివ్ గా పని చేస్తున్న జగిత్యాల జిల్లా ఇస్లాంపురకు చెందిన అబ్దుల్ సలీం ని మోస్ట్ వాంటెడ్ గా ఎన్ఐఏ ప్రకటించింది.


అబ్దుల్ సలీం….
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలోని ఓ హోటల్ లో పని చేసిన సలీం ఆ హోటల్ యజమాని ఇంటి నంబర్ పై ఆధార్ కార్డు కలిగి ఉన్నాడు. హోటల్ లో పని చేసిన సలీం తర్వాత ఓ ఫర్నిచర్ దుకాణం పెట్టిన కొద్ది రోజులకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇతన్ని ఎన్ ఐ ఏ మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించడంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
 ఈ ముగ్గురు గురించి సమాచారం తెలిసిన వారు 9497715294కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరింది. ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం సైతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పీఎఫ్​ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, గత ఏడాది సెప్టెంబరులో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనం సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కర్నూలు, నెల్లూరుల్లో దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. అంతకు ముందే నిజామాబాద్ పోలీసులు పీఎఫ్ఐ(PFI) కార్యకలాపాలపై కేసులు నమోదు చేయడం కలకలం రేపింది. ఆ కేసు ఆధారంగానే ఎన్ఐఏ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా దాడులు చేయడం గమనార్హం. తాజాగా పీఎఫ్ఐ కేసులోనే తెలుగు రాష్ట్రాల్లోని ముగ్గురితో పాటు కేరళలో 11 మందిని, కర్ణాటకలో అయిదుగురిని, తమిళనాడులో అయిదుగురిని మోస్ట్ వాంటెండ్ జాబితాలో చేర్చింది.
పాఫులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా కేసులో ఇప్పటివరకు 17 మంది నిందితులను ఎన్​ఐఏ అరెస్టు చేసింది. వీరిపై 2022లో నిజామాబాద్​ ఆరో టౌన్​ పీఎస్​లో నమోదైన కేసు ఆధారంగా కేసు నమోదు చేసి జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును చేస్తుంది. 2047లోపు భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనే లక్ష్యంతో పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా సంస్థ నిందితులు పని చేస్తున్నారని ఎన్​ఐఏ తెలిపింది. ముస్లిం యువతకు దేహదారుఢ్య శిక్షణ పేరుతో మారణాయుధాలతో దాడి చేయడంపై నిందితులకు పీఎఫ్​ఐ సంస్థ శిక్షణ ఇచ్చినట్లు ఎన్​ఐఏ దర్యాప్తులో తేలింది. ఇప్పటికీ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతుంది.