పార్లమెంట్ లోక్ సభలో  గ్యాలరీ నుంచి సభ లోకి దూకిన ఇద్దరు!

👉ఢిల్లీ పోలీస్ అదుపులో ఇద్దరు ?

J.SURENDER KUMAR

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.  మధ్యాహ్నం ఇద్దరు ఆగంతుకులు సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకారు.  మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇద్దరు ఆగంతకులు కిందకు దూకగానే గ్యాస్ విడుదల చేసే వస్తువులను సభలోకి విసిరారు.

సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్​ ఈ పరిణామంతో అప్రమత్తమై వెంటనే సభను వాయిదావేశారు. ఆగంతకుల చర్యతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా సభ నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు, పార్లమెంట్ బయట ఇద్దరు వ్యక్తులు స్మోక్ డబ్బాలతో నిరసనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనలో గ్యాస్​ విడుదల చేసే వస్తువులను దుండగులు తాము ధరించిన బూట్ల నుంచి తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆగంతకులు విసిరిన వస్తువుల నుంచి విడుదలైన పొగతో సభలో కలకలం రేగింది. కొంతమేర పొగ అలుముకుంది. కొందరు ఎంపీలు తెగువ ప్రదర్శించి గ్యాలరీ నుంచి దూకిన వ్యక్తులను చుట్టుముట్టారు. ఈలోపు అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బందికి ఆగంతకులను అప్పగించారు.

దిల్లీ పోలీసులకు స్పీకర్ ఆదేశం!

ఘటనపై విచారణ కోసం దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. సభలో దుండగులు స్ప్రే చేసింది పొగ మాత్రమేనని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

మరోవైపు, పసుపురంగు పొగలు చిమ్మే డబ్బాలతో పార్లమెంటు బయట నిరసన తెలుపుతున్న మరో ఇద్దరిని కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ మహిళను నీలమ్(42)గా, మరో వ్యక్తిని శిందే(25)గా గుర్తించారు. ట్రాన్స్​పోర్ట్ భవన్ ఎదుట వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని పార్లమెంట్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

రెండు గంటలకు పార్లమెంటు సమావేశం ప్రారంభమైంది.