👉ప్రతి మిల్లర్ ₹,4 కోట్ల ధాన్యం అమ్ముకున్నారు!
👉డీలర్లకు ఓ న్యాయం ? మిల్లర్లకు ఓ న్యాయమా ?
👉పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా 20వేల కోట్ల విలువగల ధాన్యాన్ని రైస్ మిల్లర్ల కు అప్పగించిందని, సకాలంలో వాళ్లు సీఎంఆర్ చెల్లించకపోగా ప్రతి మిల్లర్ దాదాపు ₹ 4 కోట్ల విలువైన ధాన్యం అమ్ముకున్నారని
విజిలెన్స్ విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ లో మంగళవారం ఆయన, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల అసెంబ్లీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
రేషన్ దుకాణాలపై దాడులు నిర్వహించే అధికారులు 50 కిలోలు తక్కువ ఉంటే 6a కేసులు నమోదు చేసి లైసెన్సు రద్దుచేసి వారిని ఇబ్బందులకు గురిచేసే అధికారులు రైస్ మిల్లర్లపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. రైతాంగాన్ని క్వింటాల్ కు 8 కిలోల చొప్పున రైతులకు నష్టం కలిగించి, ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకుంటూ మిల్లర్లు, ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ పరిరక్షించలేకపోయారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను ఉరి తీయాలని జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ లీడర్లు ప్రాజెక్టుల డిజైన్ చేస్తే ఇలానే అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంతో గొప్పగా ప్రచారం జరిగిందని, ఇవాళ అదే ప్రాజెక్టులో నాణ్యత ప్రమాణాలు లోపించడంతో దేశంలో తెలంగాణ తలదించుకునే పరిస్థితికి వచ్చిందని మండిపడ్డారు. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.