అమర్ రాజా కంపెనీకి సంపూర్ణ సహకారం – సీఎం రేవంత్ రెడ్డి !

👉సీఎం కార్యాలయ ప్రకటనలో..

J.SURENDER KUMAR,

అమర్ రాజా కంపెనీకి  సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో ఈ సంస్థ పాత్ర చాలా కీలకం అని కొనియాడారు. సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డిని, మంత్రి శ్రీధర్ బాబు ను బుధవారం అమర్ రాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా ది కీలక పాత్రని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమర్ రాజా కంపెనీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

శుద్ధ ఇంధనం ఉత్పత్తికి తెలంగాణ కట్టుబడి ఉందని, అలాగే బ్యాటరీల ఉత్పత్తిలో అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం అందజేస్తుందని చెప్పారు.
తెలంగాణలో వ్యాపారం విస్తరిస్తాం :
 గిగా కారిడార్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని అమర్‌ రాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. తెలంగాణలో తమ వ్యాపారాలను మరింత విస్తరిస్తామన్నారు. విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని గల్లా జయదేవ్ తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీని మహబూబ్ నగర్‌లో అమర్ రాజా సంస్థ నిర్మిస్తుంది. అలాగే శంషాబాద్‌లో ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ఉత్పత్తులలో ₹9,500 కోట్ల పెట్టుబడులను పెట్టి, ప్రత్యక్షంగా 4,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.


ఇదిలా ఉండగా తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు, బుధవారం అంబేద్కర్ సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.