👉సీఎం కార్యాలయ ప్రకటనలో
J.SURENDER KUMAR
పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో. పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం బిజీ బిజీగా పలు ప్రముఖ సీఈఓ లతో చర్చలు జరుపుతున్నారు.
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్, ఇథియోఫియా ఉపప్రధాని మేకొనెన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై రేపు జరగనున్న చర్చాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు.
దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటన కొనసాగుతోంది. ఆదివారం రాత్రి ఒంటిగంటకు దిల్లీ నుంచి బయలు దేరిన సీఎం బృందం, సోమవారం మధ్యాహ్నం జూరిచ్ విమానాశ్రయానికి చేరుకుంది. జూరిచ్ విమానాశ్రయంలో పలువురు ప్రవాస భారతీయులను రేవంత్‌రెడ్డి కలిసి కొద్దిసేపు మాట్లాడారు. జూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు సీఎం బృందం వెళ్లింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్, ఇథియోఫియా ఉపప్రధాని మేకొనెన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విద్యార్థులకు నైపుణ్యం పెంచడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై చర్చించారు.
సదస్సు కోసం దావోస్ వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, సీఈవోలతో సీఎం బృందం చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక్, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను సీఎం కలువనున్నారు.
భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో పాటు సీఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో నేడు, రేపు సీఎం చర్చిస్తారు. ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సహ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.