జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు పై ప్రభుత్వంలో కదలిక.?

J.SURENDER KUMAR,

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయింపు అంశంపై  ప్రభుత్వంలో కదలిక మొదలైనట్టు సమాచారం. ఈ మేరకు మండలాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి వివరాలను, గతంలో కొందరు జర్నలిస్టులకు మంజూరు చేసిన ఇంటి స్థలాల వివరాలను, ఇంటి స్థలాలు కేటాయింపుకు అర్హత వివరాలను, ఎంతమంది జర్నలిస్టులకు పంపిణీ చేశారు ? తదితర వివరాలను గురువారం ఆయా మండల రెవెన్యూ తాసిల్దార్ లో నుంచి  ప్రభుత్వం కోరినట్టు తెలిసింది..

ఈ మేరకు గతంలో జర్నలిస్టుల కు ప్రభుత్వం  ఇచ్చిన ఇంటి పట్టాల జిరాక్స్ ప్రతులు సేకరించి వివరాలను తాసిల్దార్లు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు సమాచారం.
ఇది ఇలా ఉండగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దశాబ్ద కాలం పాటు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయింపు అంశంపై ప్రత్యేకంగా ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్ , కరీంనగర్ తదితర ప్రాంతాల్లో  కొందరు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించారు. ( ఈ ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రత్యేక జీవో మాత్రం లేదు) గత ప్రభుత్వం లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఆదేశాల మేరకే ప్రభుత్వ యంత్రాంగం పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.  మండల కేంద్రాల్లో,  పట్టణంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అంటూ ఆశలు కల్పించడం, రేపు మాపు  అంటూ గత ప్రభుత్వ పుణ్యకాలం గడిచిపోయింది.. కొందరు పాత్రికేయులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించిన అవి జర్నలిస్టు కోటా కింద కాకుండా బలహీన వర్గాల కోటాలో కేటాయించినట్లు సమాచారం. 
హైదరాబాదులో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అంశంలో సుప్రీంకోర్టు జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ప్రభుత్వం ఈ అంశాన్ని పెండింగ్ పెట్టింది. గత రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో మెమో No.71507/ 1992-11-19  జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయింపు పై సర్కులర్ జారీ చేసింది. దాని ఆధారంగానే నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పలువురు జర్నలిస్టులకు మండలాల్లో, పట్టణాలలో, ఇంటి స్థలాలను పొందారు.. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో  వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయింపు కోసం విధి విధానాలు  ఖరారు చేసి అక్రిడియేటెడ్ జర్నలిస్టుల నుండి  ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. త్వరలో వారికి పట్టాలు పంపిణీ చేయనున్నట్టు సమాచారం. 

ఫైల్ ఫోటో!

ఇదిలా ఉండగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు,  కే శ్రీనివాసరెడ్డి  ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘ రాష్ట్ర నాయకులు విరహత్ అలీ, నరేందర్ రెడ్డి, రామ్ నారాయణ, తదితరులు సంబంధిత శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ని కలిసి జర్నలిస్టుల సమస్యల తో పాటు ఇంటి స్థలాల గురించి వివరించి వినతిపత్రం ఇచ్చారు.. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందా ? తర్వాతనా జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.