జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా !
J.SURENDER KUMAR,
లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకోని ఆ దిశగా ముందడుగు వేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
గురువారం లూయిస్ బ్రెయిలీ 215 వ జన్మదిన వేడుకను IDOC సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ బ్రెయిలీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని దివ్యాంగులు ఆ దిశగా లక్ష్యాన్ని ఎంచుకొని ముందడుగు వేయాలని అన్నారు.
నిరాశ నిస్పృహలకు లోను కాకుండా దివ్యాంగులు సకలాంగుల మాదిరిగానే లక్ష్యాన్ని ఎంచుకొని అకుంటిత దీక్షతో ఆ దిశవైపు పయనించాలని అన్నారు. దివ్యాంగులకు చట్టరిత్యా సంక్రమించవలసిన సౌకర్యాలన్నీ పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల యువతకు పలు రంగాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వైకల్యాన్ని సామర్థ్యంగా మార్చుకొని ఉన్నత స్థానాలను పొందాలని సూచించారు. జిల్లాలో సదరం క్యాంపులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ప్రతిభ ఆధారంగా లబ్దిపొందాలని ఆకాంక్షించారు. బ్రెయిలీ లిపి ద్వారా అంధులకు లబ్ది చేకూరిందని అన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, బ్రెయిలీ విగ్రహ స్థాపనకు మున్సిపల్ అధికారులతో చర్చించి చర్యలు చేపడతామని సూచనప్రాయంగా తెలిపారు.

అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ జనవరి 4 ను నాణ్యమైన దినంగా పాట రూపంలో వ్యక్తపరచడం అభినందనీయమని అన్నారు. ఆరు చుక్కలతో బ్రెయిలీ లిపిని రూపొందించడం అకుంటిత దీక్ష పరిజ్ఞానంతో తయారు చేయడం జగిగిందని అన్నారు. భవిష్యత్ తరాల వారికీ ఉపయోగపడే వాటిని రూపొందించడానికి నాంది పలకాలని అన్నారు. చిరు ప్రాయంలోనే మహోన్నత వ్యక్తిగా లూయిస్ బ్రెయిలీ ఎదిగాడని అన్నారు. ఆనాటి ఆయన కష్టంతోనే ఈనాటి బ్రెయిలీ లిపి ఆస్వాదిస్తున్నామని అన్నారు.

క్రమ శిక్షణ, పట్టుదల, భవిష్యత్ తరాల వారికీ మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు అంధుల సంఘ నాయకులు మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి బ్రెయిలీ మార్గదర్శకులు అయ్యారని, 1809 జనవరి 4 ఆయన జన్మదినాన్ని పుణ్య దినంగా అభివర్ణించారు.

అంతకుముందు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లూయిస్ జన్మదినాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కేక్ కట్ చేశారు. కార్యక్రమం అనంతరం పలువురు అంధులను శాలువా, మెమెంటోలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పలువురు సంఘ నాయకులు, అంధులు, పోషకులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.