సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన ‘ది దక్కన్ పవర్ ప్లే’ పుస్తకావిష్కరణ!

👉ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా లో ..

J.SURENDER KUMAR,

సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన ‘ది దక్కన్ పవర్ ప్లే’ పుస్తకాన్ని ప్రధానమంత్రి పూర్వ మీడియా సలహాదారు సంజయ బారు ఆవిష్కరించారు.
రూప పబ్లికేషన్స్ ముద్రించిన ఈ పుస్తక తొలి ప్రతిని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్. వెంకట్ నారాయణ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గౌతమ్ లాహిరి లు స్వీకరించారు.
ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా లో నేటి సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇండియన్ జర్నలిస్ట్స్ మాజీ ప్రెసిడెంట్ ఎస్.ఎన్. సిన్హా అధ్యక్షత వహించారు.
ఇండియన్ జర్నలిస్ట్స్ మాజీ ప్రెసిడెంట్ ఎస్.ఎన్. సిన్హా మాట్లాడుతూ..అమర్ నుంచి రాజకీయ సంబంధిత రచనలు ఇంకా వెలుగులోకి రావాలని కోరారు.

పుస్తక రచయిత అమర్ మాట్లాడుతూ..

జర్నలిజం రంగంలోకి తను ప్రవేశించి 45 సంవత్సరాలు పూర్తి అయింది అని, పొలిటికల్ జర్నలిస్ట్ గా వైఎస్ రాజ శేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ల రాజకీయ జీవితాలను చాలా దగ్గర నుంచి గమనించడం జరిగిందని అన్నారు.
అనేక పుస్తకాలను పరిశీలించిన అనంతరం ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో వ్రాయడం జరిగింది అని, త్వరలో ఈ పుస్తకాన్ని తెలుగులో కూడా “మూడు దారులు” గా వెలువడుతుందని తెలిపారు.
ఈ పుస్తకాలను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రచురించిన రూపా పబ్లికేషన్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎస్. వెంకట్ నారాయణ్ మాట్లాడుతూ..

దక్షిణ భారతదేశం నుంచి ప్రచురించ బడిన రాజకీయ సంబంధిత పుస్తకాలు చాలా తక్కువ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులను దగ్గరగా అనుసరించడం వల్ల మాత్రమే వారి జీవిత చరిత్రలను వ్రాయడానికి అవకాశం లభిస్తుందని, అటువంటి అనుభవంతో పుస్తకాన్ని రచించి, వెలుగులోకి తెచ్చిన అమర్ అభినందనీయుడని, దక్షిణ భారతదేశం లో జరిగిన రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం ఉందని నారాయణ్ అన్నారు.

సంజయ బారు మాట్లాడుతూ…

రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు ఇటీవలి కాలంలో ప్రచురించ బడలేదు అని, ఈ పుస్తకాన్ని సరైన సమయంలో అమర్ రచించడం అభినందనీయం అని సంజయ బారు అన్నారు. ఏ పుస్తకం ఎప్పుడు రాయాలి అనేది ప్రతి పుస్తక రచయిత హక్కు, అని, దానికి ముహూర్తాలు చూసుకో వలసిన అవసరం లేదు అన్నారు. రాజకీయ నాయకుల వైఫల్యాలతో రాష్ట్రాలభివృద్ధి కోసం ముఖ్యమంత్రులు చేసిన కృషిని కూడా పుస్తక రూపంలో వెలుగులోకి తేవాలని సంజయ బారు ఈ సందర్భంగా సూచించారు.
సీనియర్ పాత్రికేయులు బి. ఎస్. రామకృష్ణ వందన సమర్పణ చేశారు.