👉గుజరాత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ !
J.SURENDER KUMAR
బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను సోమవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది.
గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని తేల్చి చెప్పింది. ఈ అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది. “దోషికి సంబంధించిన విచారణ, జైలు శిక్ష విధింపు ఎక్కడైతే జరిగిందో అక్కడే క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది” అని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన అత్యున్నత ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. క్షమాభిక్ష నిర్ణయంపై పునరాలోచన చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన 21ఏళ్ల బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది.

ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. అల్లర్లలో మూడేళ్ల కుమార్తె తో సహా బిల్కిస్ కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అత్యాచార ఘటనలో దోషులుగా తేలిన 11 మందికి జీవితఖైదు శిక్ష పడింది. కాగా, గుజరాత్ ప్రభుత్వం వారిని 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. క్షమాభిక్ష ప్రసాదించి వారిని ఆగస్టు 15న రిలీజ్ చేసింది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బిల్కిస్ బానో. విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. కేసు తీవ్రత ఏంటో పట్టించుకోకుండా 11 మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని ఆక్షేపించింది. క్షమాభిక్ష ప్రసాదించే ముందు దోషుల నేర తీవ్రతను పరిశీలించాలని స్పష్టం చేసింది.