J.SURENDER KUMAR,
ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శనివారం హైదరాబాద్ సచివాలయంలో ధరణి సమస్యల పరిష్కారం పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం అధికారులతో మాట్లాడుతూ…
👉 సీసీఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని సీఎం ప్రశ్నించారు.
👉రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటాను, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ దగ్గర ఉంచటాన్ని ముఖ్యమంత్రి తప్పు బట్టారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా.. సురక్షితంగా ఉన్నట్టా.. లేనట్టా.. అని అనుమానాలు వ్యక్తం చేశారు.
👉2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్మెంట్ ను అప్పగించిందని అధికారులు బదులిచ్చారు.

👉ఆ కంపెనీ దివాళా తీసిందని, తర్వాత టెర్రాసిస్ అని పేరు మారటం, డైరెక్టర్లు అందరూ మారిపోవటం, తర్వాత వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీగా చేతులు మారటంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
👉బిడ్ దక్కించుకున్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు.
👉భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా.. అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
👉2018లో రూ.116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని సీఎం అన్నారు.
👉మన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున.. విలువైన భూములను పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా.. అని సీఎం రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు.