నిర్లక్ష్య వైద్యానికి లక్షలాది రూపాయల జరిమానా !

👉అపోలో రీచ్ ఆసుపత్రి పై ఆగ్రహం !

👉బాధితురాలికి న్యాయం !


J.SURENDER KUMAR,


వైద్యో నారాయణ హరి అంటారు, వైద్యుడు రోగుల పాలిట కనిపించే దైవం, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనేకమంది రోగులకు, క్షతగాత్రులకు ప్రాణాలు కాపాడాలి అనే తపనతో వైద్య సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబాలు అనేక మంది వైద్యులను దైవానికి ప్రతిరూపాలుగా ఆరాధిస్తారు, అలాంటి వైద్యులకు జీవితాంతం వారు కృతజ్ఞతా భావంతో ఉంటారు.
అయితే కొన్ని సందర్భాల్లో వైద్యుల నిర్లక్ష్యంతో నరకయాతన అనుభవించిన బాధిత రోగులు, వైద్యుల నిర్లక్ష్య వైద్యం పై న్యాయస్థానాన్ని ఆశ్రయించి అలాంటి వైద్యులకు, ఆసుపత్రులపై చర్యలకు ఫిర్యాదు చేసి న్యాయం పొందుతారు.
వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన ఏనుగు సుగుణ, తన ఎడమ కాలు నొప్పి వైద్యానికి కరీంనగర్ లోని అపోలో రీచ్ ఆస్పత్రికి వెళ్ళింది. వైద్య పరీక్షల అనంతరం 2012 జూన్ 25న ఆమె కాలుకు వైద్యుడు పంకజ్ కుమార్ ఆపరేషన్ చేశారు. 2012 జూన్ 30న ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.


సుగుణ కాలనొప్పి ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో 2013 మార్చ్ 19న కరీంనగర్లోని రేణి ఆసుపత్రిలో చేరి మార్చి 23న ఆపరేషన్ చేయించుకుంది. 2013 మార్చి 27న డిశ్చార్జ్ అయింది. మొదలు చేసిన ఆపరేషన్ వైద్యులు నిర్లక్ష్యంతో చేశారని, అందుకే నీ కాలు నొప్పి అంటూ, రేణి ఆసుపత్రి వర్గాలు సుగుణకు వివరించారు.


తనకు న్యాయం చేయాలని ఏనుగు సుగుణ జగిత్యాల పట్టణం కు చెందిన ప్రముఖ న్యాయవాది మిట్ట మహేందర్ ను ఆశ్రయించింది. 2014 జులై 10న జిల్లా వినియోగదారుల ఫోరంలో న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేసింది. కేసు పూర్వ పరాలు పరిశీలించిన న్యాయమూర్తి కే స్వరూప రాణి, సభ్యులు శ్రీలత, నరసింహారావులు ఈనెల 25న సంచలన తీర్పు ఇచ్చారు. బాధితురాలు సుగుణకు ₹ 2 లక్షల రూపాయలు. 10/7/2014 నుంచి 9% వడ్డీతో నష్టపరిహారం చెల్లించాలని. ఖర్చుల నిమిత్తం మరో ఐదు వేలు చెల్లించాలని, అపోలో రీచ్ ఆసుపత్రి నీ ఆదేశిస్తూ, ఆపరేషన్ చేసిన వైద్యుడు పంకజ్ కుమార్ పై ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది.