తిరుమలలో విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం !

J.SURENDER KUMAR,

భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని, సమస్త మానవాళి కల్యాణం కోసం భక్తిని చాటేందుకు టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలోని నాద నీరాజనం వేదికపై మంగళవారం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం జరిగింది.

అనేకమంది  భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనగా, లక్షలాది మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారి ఇళ్లలో పారాయణం చేశారు. ఈ పారాయణ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. సంస్కృత పండితులు శ్రీమాన్ కోగంటి రామానుజాచార్యులు,  మారుతి,  అనంతగోపాలకృష్ణ పారాయణానికి నాయకత్వం వహించారు.


ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి. కవిత బృందం “అని యానతిచ్చే కృష్ణదార్జునునితో…” మరియు ఇతర సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేద విద్యాలయం, కంచి కామకోటి పీఠం వేద పాఠశాలకు చెందిన వేదపండితులు, విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.


👉ట్రస్ట్‌లకు  ₹ 43 లక్షలు విరాళం!

బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు  వర్థమాన్ జైన్, టిటిడిలోని వివిధ ట్రస్టులకు ₹.43 లక్షలు విరాళంగా ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన డీడీలను మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ ఈవో  ఏవీ ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ₹.33,33,000, టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ట్రస్టుకు ₹10,11,000 అందజేశారు.