తిరుపతి ఆవిర్భావ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు !


👉 ఈనెల 24న , 895 వ సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు!

👉 టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

J.SURENDER KUMAR,


ఫిబ్రవరి 24న తిరుపతి మూలవిరాట్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను ముమ్మరం చేయాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధికారులను కోరారు.ఈ  ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో చైర్మన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ

శ్రీవారి పాద పీఠం నగరమైన మన తిరుపతి కి తిరుమల జన్మదిన వేడుకలు నిర్వహించాలన్నారు.
తిరుపతి నగరం 24-02-1130 న సౌర్యనామ సంవత్సరం, పాల్గుణ పౌర్ణమి, ఉత్తరా నక్షత్రం, సోమవారం నాడు ఆవిర్భవించిందని చరిత్ర లో. పేర్కొనబడిందన్నారు.  శ్రీ వైష్ణవ సన్యాసి, భగవద్ శ్రీ రామానుజాచార్యులు ఆ రోజున తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామిని ప్రతిష్టించి, వైఖానస ఆగమ సూత్రాల ప్రకారం కైంకర్యముల ను రూపొందించారు అని చైర్మన్ వివరించారు.


గుడి చుట్టూ నాలుగు మాడ వీధుల నిర్మాణాన్ని కూడా వారే ప్రారంభించినట్టు చారిత్రిక ఆధారాలు ఉన్నాయన్నారు.
మొదట్లో తిరుపతిని “గోవిందరాజ పురం” అని, ఆ తర్వాత “రామానుజపురం” అని పిలిచేవారు మరియు 13వ శతాబ్దం ప్రారంభం నుండి దీనిని తిరుపతి అని పిలుస్తున్నారని అన్నారు.
తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 24న ఉదయం 8 గంటలకు శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల సహకారంతో వివిధ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు అని తెలిపారు.
వివిధ కళారూపాలు మంగళధ్వని, వేదఘోష ఉంటాయి. గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి కర్నాల వీధి, బేరివీధి, గాంధీరోడ్డు, ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. టీటీడీలోని ఆయా శాఖల అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలి. పోలీసులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా క్రమబద్ధీకరించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు
.

ఈ సమావేశంలో టీటీడీ జేఈవో  వీరబ్రహ్మం, FACAO  బాలాజీ, సీఏవో  శేషశైలేంద్ర, చీఫ్ పీఆర్వో డా.టి.రవి, ఆల్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజగోపాల్, ట్రాన్స్‌పోర్ట్ జీఎం  శేషారెడ్డి, డిప్యూటీ ఈఓ . శివప్రసాద్, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు.