👉రిక్షాలో అసెంబ్లీకి వచ్చిన నేత.
👉కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన తొలి దళితుడిగా కూడా రికార్డు సృష్టించారు.
👉మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా..
****
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన దామోదరం సంజీవయ్య హాయంలో మొట్టమొదట వృద్ధాప్య పెన్షన్ పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో పలువురు నాయకులు నిస్వార్ధంగా పని చేశారు. అటువంటి వారిలో దామోదరం సంజీవయ్య ఒకరు.1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో మునెయ్య, సుంకులమ్మలకు ఐదవ సంతానంగా సంజీవయ్య జన్మించారు. ఆయన పుట్టిన మూడు రోజులకే తండ్రి మునెయ్య చనిపోయారు.
మేనమామల సంరక్షణలో చదువుకున్నారు. కర్నూలు మునిసిపల్ హైస్కూల్, అనంతపురం ఆర్ట్స్ కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు. రెండవ ప్రపంచం యుద్ధం సందర్భంగా బ్రిటిష్ వారు ఆహార ధాన్య సేకరణ విస్తృతంగా చేస్తున్న రోజుల్లో కర్నూలు సివిల్ సప్లయిస్‌లో గుమస్తాగా, బళ్లారి సివిల్ సప్లయి విభాగంలో ఇనస్పెక్టర్‌గా పనిచేశారు. అక్కడ పరిచయమైన ఒక జడ్జి సలహాతో మద్రాస్ వెళ్లి లా చదివారు. అక్కడ డబ్బుల కోసం ట్యూషన్లు చెప్పేవారు. లా పూర్తయ్యాక పిలకా గణపతి శాస్త్రి, జాస్తి సీతామహాలక్ష్మిల దగ్గర జూనియర్ అప్రెంటిస్‌గా చేరారు. ఆయన యాదృచ్ఛికంగా రాజకీయాల్లో చేరారు.
1952లో తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి 1960లో సీఎం అయ్యే వరకూ మంత్రిగా కొనసాగారు. ఆంధ్ర రాష్ట్రంలో 1953లో ప్రకాశం కాబినెట్‌లో సాంఘిక సంక్షేమ, ఆరోగ్య శాఖలు, 1955 బెజవాడ గోపాల రెడ్డి కాబినెట్‌లో రవాణా, వాణిజ్య పన్నులు, స్థానిక సంస్థల పాలన శాఖలను నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956లో నీలం సంజీవ రెడ్డి కాబినెట్‌లో కార్మిక, స్థానిక సంస్థల శాఖ నిర్వహించారు.
1956 నుంచి 1960 ప్రారంభం వరకూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ఉన్నారు. ఆయన అనివార్య కారణాల వల్ల పదవి దిగిపోయినప్పుడు, ఆ స్థానంలో సంజీవయ్య నియమితులయ్యారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు రిక్షాపై వచ్చేవారు.
1962-1964 వరకూ నెహ్రూ హయాంలో, 1971-72 మధ్య ఇందిర హయాంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేశారు సంజీవయ్య. అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన తొలి దళితుడిగా కూడా రికార్డు సృష్టించారు.
సంజీవయ్యకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆయనకు పిల్లలు లేరు. సావిత్రి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధాప్య పింఛన్ కార్యక్రమాన్ని అమలు చేశారు.
సంజీవయ్య షుగర్ వ్యాధితో బాధపడేవారు. 51 ఏళ్ల వయసులో 1972 మే 5 న మరణించారు. 2006లో పార్లమెంటు సెంట్రల్ హాలులో సంజీవయ్య ఫోటో ఆవిష్కరించారు. ఆయన పేరుతో స్టాంప్ కూడా ఆవిష్కరించారు.
న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన సహాధ్యాయి అయిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి నమోదు చేసిన జ్ఞాపకాలు ఈ సందర్భంగా గమనార్హం. ‘‘నేను, సంజీవయ్య కలిసి రెండేళ్ల పాటు న్యాయశాస్త్రాన్ని అభ్యసించాం. సంజీవయ్యలో ఎలాంటి న్యూనతాభావాలు ఉండేవి కావు. ఇతర కులాలవారితో తానూ సమానమేనని గట్టిగా విశ్వసించేవారు. ఆ విశ్వాసానికి అనుగుణంగానే ఆయన ప్రవర్తించారు’’ అన్న రావి శాస్త్రి వారి పరిశీలన సంజీవయ్య ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
వ్యాసకర్త : యం.రాం ప్రదీప్ , తిరువూరు
మొబైల్ ;9492712836