👉మా సైన్యం, బలం, బలగం మీరే…
J.SURENDER KUMAR,
ఆడబిడ్డల ఆశీర్వచనాలతో నే మా ప్రభుత్వం ఏర్పడింది. వచ్చే ఐదేళ్లలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందరమ్మ ప్రభుత్వం తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా సైన్యం మీరే, మా బలగం మీరే, రాబోయే రోజుల్లో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు నిర్వహిస్తామని చెప్పారు.

మంగళవారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మహాలక్ష‍్మి స్వశక్తి మహిళా సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశం ఏర్పాటు చేయాలని 48 గంటల ముందు చెబితే మీరంతా హాజరై మహిళా శక్తిని నిరూపించారు. మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. నెల రోజుల్లో మహాలక్ష‍్మిలకు షాపులను ఏర్పాటు చేసి వాటి చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
👉 మీ కష్టం చూసిన, మీ నైపుణ్యం చూసిన, మీ ఉత్పత్తులను చూసిన, మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. మీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద షాపులను కట్టించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా మీ వస్తువుల విక్రయానికి అవకాశం కల్పిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వశక్తి మహిళా సంఘాలకు హామీ ఇచ్చారు.

👉 రాష్ట్రంలోని మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులున్నారు. రానున్న రోజుల్లో కోటి మంది మహిళలు చేరాలని పిలుపునిచ్చారు. కోటి మందిని కోటీశ్వరులను చేస్తే మన రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రగతికి విధాన పత్రం విడుదల చేశారు.
👉 మీ కష్టాలను చూసే ఆడబిడ్డలకు అండగా నిలవాలన్న లక్ష‍్యంతోనే ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చామని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే మహాలక్ష‍్మి పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చే గృహలక్ష‍్మి పథకం, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని ఇందరమ్మ ఇండ్లు, వారి కన్నీళ్లు తుడవాలని రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు.

👉 ప్రభుత్వం ఏర్పడే నాటికి 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. సదస్సులో మొదట మంత్రులతో కలిసి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి ఆయా సంఘాల ఉత్పత్తులను పరిశీలించారు.
👉 మహిళలు స్వయం ఉపాధితో రాణిస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఆయా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకుంటూ వారి శ్రమను కొనియాడారు. స్వశక్తితో పైకి రావాలన్న వారిలోని ఆశయంపై ఆనందం వ్యక్తం చేశారు.

👉 స్టాళ్లలో బంజారా ఉత్పత్తులు, సిషల్ ఆర్టికల్స్, నకాషి పెయింటింగ్స్, డర్రిస్, మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్కూల్ యూనిఫామ్స్, టస్సార్ చీరలు, హ్యాండ్లూమ్స్, టై అండ్ డై క్లాత్స్, గొల్లభామ చీరలు, లెథర్ ఉత్పత్తులు, చెక్కబొమ్మల ఉత్పత్తులు, కొబ్బరి పీచు ఉత్పత్తులు, పెంబర్తి బ్రాస్, మిల్లెట్ ఉత్పత్తులు, digi పే పాయింట్, VLE పాయింట్, పశుమిత్ర, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, ఉడ్ క్రాఫ్ట్స్, హోమ్ ఫుడ్స్‌కు సంబంధించిన అనేక ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. స్వయం ఉపాధితో పేదరికం నుంచి లక్షాధికారులుగా మారిన మహిళల స్పూర్తిని సీఎం అభినందించారు.