లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ద్వారా…

👉ఏపీ పాలిటెక్నిక్‌లలో “ఈవై గ్రీన్ స్కిల్స్ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్!


J.SURENDER KUMAR,

పాలిటెక్నిక్ విద్యార్థులలో స్థిరత్వం, ఉపాధి సాఫల్యత, వ్యవస్థాపకత రంగాలలో వారిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ” ఈవై గ్రీన్ స్కిల్స్ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ “ను అమలు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

గ్రీన్ ఎకానమీ రంగంలో విజయం సాధించడానికి అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయటానికి ఇది ఉపకరిస్తుందన్నారు. శుక్రవారం సాంకేతిక విద్యా శాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ మధ్య ఈ మేరకు అవగాహనా ఒప్పందం జరిగింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సీనియర్ జనరల్ మేనేజర్ వందనా చౌదరి పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.


ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ పాలిటెక్నిక్ రెండవ, చివరి సంవత్సరం విద్యార్థులకు ఈవై గ్రీన్ స్కిల్స్ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటిలో భాగంగా సహకరించేందుకు సంస్ధ ముందుకు వచ్చిందన్నారు. 11 గంటల వ్యవధి కలిగిన ఈ కోర్సును పూర్తి చేసిన తర్వాత ఎర్నెస్ట్, యంగ్ (ఈవై), మైక్రోసాఫ్ట్ సంయిక్త ధృవీకరణ శిక్షణా పత్రాన్ని అందుకుంటారన్నారు. విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, శిక్షణ అవకాశాలు, సుస్థిరమైన పద్ధతులతో కూడిన వ్యవస్థాపక నాయకత్వంపై మార్గనిర్దేశం చేసేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమాన్ని తొలుత విశాఖపట్నం ప్రాంతంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో అమలు చేసి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నామని చదలవాడ నాగరాణి వివరించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ ఉపసంచాలకులు (ట్రైనింగ్, ఉపాధి) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.