J.SURENDER KUMAR,
వైఎస్సార్ నుంచి ఆయన వారసత్వం వరకూ మొదలుకుంటే మొదట గుర్తొచ్చే మాట.. ‘ మడమ తిప్పం, మాట తప్పం ‘ కానీ, వైఎస్సార్ తో మొదలైన ఆ మాటలు ఆయనకు యాప్టైనంతగా.. ఆయన వారసులకు సరిపోతున్నాయా ? అన్నది ఇప్పుడో చర్చ.
అయితే, తన తండ్రి చనిపోతే గుండెలాగిన వందలాది మందిని ఓదారుస్తూ యాత్ర చేపట్టిన జగన్ లోనూ తండ్రి ఛాయలు.. ఆడిన మాట తప్పకూడదనే ఓ బలమైన భావన అయితే కనిపిస్తాయిగానీ… ఆయన కూతురిగా వారసురాలన్నట్టుగా ప్రచారంలోకొచ్చిన షర్మిల మడమ తిప్పకపోవడం.. మాట తప్పకపోవడంపైనే ఇప్పుడు సందేహాలు ముసురుకున్నాయి.
తెలంగాణాలో తిరిగి వైఎస్సార్ పాలన తీసుకురావడమే తన ఆరాటమని.. అందుకే తన పోరాటమని నినదిస్తూ వందల కిలోమీటర్ల పాదయాత్రతో తనకంటూ ఓ గుర్తింపునైతే తెచ్చుకుంది షర్మిల. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన తెలంగాణా వాస్తవానికి ఓ చైతన్యవంతమైన సమాజం. తమ వాళ్లెవ్వరో, పరవాళ్లెవ్వరో గుర్తించే నేర్పరితనమున్న ఓటర్ల సమూహం. తమవారైనా… పరాయివారి చేష్టలు చేస్తే కీలెరిగి వాత పెట్టే చందమనేది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరం చేసిన బీఆర్ఎస్ ను చూసినప్పుడు మనందరితో పాటు మిగిలిన ప్రపంచమంతా గమనించి గుర్తించాల్సిన సత్యం.
ఆ క్రమంలో షర్మిల ఎవరు వదిలిన బాణమనే చర్చ సర్వత్రా వినిపించింది. షర్మిల సోషల్ మీడియా మీమ్స్ స్టారైపోయింది. పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అంటూ పలికిన ఆమె చిలుకపలుకులను.. సోషల్ సైట్స్ కళ్లకద్దుకుని తమ మీమ్స్ కు, షార్ట్స్ కు, రీల్స్ కు, పోస్టింగ్స్ కు.. ఇలా ఎవరికి వీలైనంత వారు వాడేసుకున్నారు.
సరే.. మరి షర్మిల ఎవరు విడిచిన బాణం..?
ఎన్నికల ముందు వైఎస్సార్టీపీ పేరుతో షర్మిల ఏర్పాటు చేసిన పార్టీ వెనుక ఎవరున్నారన్న చర్చ విస్తృతంగా జరిగింది. దాని వెనుకున్నది జగనేనని.. షర్మిల జగన్ వదిలిన బాణమేనని కొందరంటే… బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ మధ్య బంధంలో భాగంగానే వైఎస్సార్టీపీ పుట్టుకొచ్చిందని కొందరు.. కాదు కాదు, దాని వెనుకున్నది బీజేపీనేనని.. అది బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య బంధమనీ ప్రచారం జరిగింది. అసలు తన వెనుక ఎవరూ లేరనే విషయాన్నీ షర్మిల ప్రచారం చేసుకునే ప్రయత్నమూ జరిగింది. మొత్తంగా ఆమె ఎవరు విడిచిన బాణమో తేలేలోపే… షర్మిల కాంగ్రెస్ బాణమై.. తెలంగాణా కోడలిగా ఉద్ధరిస్తానన్న రాష్ట్రాన్ని వదిలి… తన తల్లిగారి రాష్ట్రమైన ఏపీకి వెళ్లిపోవడం మరో టర్న్!
తల్లిగారి ఊరెళ్లిపోవడం సరే! మరి తండ్రి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీలో చేరిక మాటేమిటి..?
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన పేరును FIR లో నమోదు చేయించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం అతి పెద్ద విషాదం! ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించబడటం మినహా.. ఆమెకు ఒనగూరిందేమీ లేదు. ఆ మాత్రం పదవి ఇవ్వకపోతే.. ఇప్పటికే కొలాప్స్ అయిపోయిన కాంగ్రెస్ ను బతికి బట్ట కట్టించేవారెవ్వరన్నది కాంగ్రెస్ పెద్దల మదిలో మెదిలిన ప్రశ్న..? అందుకే… జగన్ ను ఎదుర్కొనడంతో పాటు… ప్రతిపక్షంగా ప్రస్తుతం టీడీపీ బలమైన ఉనికి.. అంతో ఇంతో జనసేన, బీజేపీలూ చర్చల్లోకి వస్తుండటంతో… ఏపీలో అస్తిత్వం కోసం కాంగ్రెస్ వాడిన పావు షర్మిల!
మరి ఏవో కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు… ఎవరి ప్రయోజనాల కోసమో తనకు కల్పిస్తున్న ప్రచారం కోసమో… తన తండ్రి మరణానంతరం జరిగిన ఘటనలు, సోదరుడు జగన్ ను జైల్లో పెట్టిన్నాడు బయట పడిగాపులన్నీ మర్చి… ఎవరైతే తమ కుటుంబాన్ని బొంద పెట్టాలని చూశారో, వారి చెంతనే షర్మిల చేరికేంటి… పైగా ఏపీ అధ్యక్షురాలిగా పార్టీని నడిపించాల్సిన బాధ్యతలో… ఆమె కేవలం తన కుటుంబాన్నే బజార్లో నిలబెట్టేలా, ముఖ్యంగా తన అన్నను టార్గెట్ చేస్తూ… వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ… చేయదల్చుకున్నదేమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న..? దిశలో లేని… లక్ష్యం సరిగ్గా లేని బాణం ఎటువైపు వెళ్లుతుంది… ఏం చేస్తుందన్నది ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు షర్మిల పరిస్థితీ అదే అయితే… ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పై వ్యక్తిగత దాడులతో పార్టీకింత మేలు జరిగితే సరే సరే.. లేదంటే ఇప్పటివరకూ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో అదే పరిస్థితిననుభవిస్తుంది… మొత్తానికి కొండకో వెంట్రుక వేస్తే.. వస్తే కొండ, పోతే వెంట్రుక అన్నట్టుగా కాంగ్రెస్ బిగించిన ట్రాపులో షర్మిల పడ్డదన్నది డెప్త్ గా పరిశీలించే విశ్లేషకులకు అర్థమయ్యే విషయం.
తన అన్న జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ… తమ కుటుంబాన్నే బజారుకీడుస్తున్నానన్న సోయి కూడా లేకుండా… తమ కుటుంబానికే ద్రోహం చేసిన పార్టీతో చేతులు కలిపి.. పైగా ఆ పార్టీ రథసారధి బాథ్యతలే చేపట్టిన షర్మిలకు.. ఎందుకో 2014లో రాష్ట్ర విభజననంతరం మళ్లీ తొలి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కాలం నాటి విషయాలు మాత్రం గుర్తు రాకపోవడం దురదృష్టకరం. మరి నిజంగానే గుర్తు లేవా… తన అన్న జగన్నాటకాన్ని తట్టుకోలేక కావాలనే ఆడుతున్న నాటకమా… ఎవరూ చెప్పకపోవడమా… లేక తమ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముందుగానే తమ టార్గెట్ బాబు కాదు… మీ అన్నేనని చెప్పి నూరిపోయడమా తెలియదుగానీ… ఆమె ఏపీ కాంగ్రెస్ రథసారధిగా పగ్గాలు చేపట్టాక బాబు పాలనపై మచ్చుకు ఒక్కటంటే ఒక్క ఘాటు విమర్శ చేయకపోవడం… కేవలం బాబు అనంతరం పగ్గాలు చేపట్టిన తన అన్న జగనే మొత్తం ఏపీ ఏదో అయిపోవడానికి కారణమన్నట్టుగా మాట్లాడటం… ఆమె మాటలను తమ స్వార్థంలో భాగంగా ఎల్లోమీడియా హెలైట్ చేయడం ఇదీ కనిపిస్తున్న తంతు.
2014 నుంచి 2019వరకు నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హయాంలో.. రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల్లో 28 మంది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. గుర్తుందా షర్మిలా…? తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను.. ఏపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.. మర్చిపోయారా షర్మిల..? ప్రత్యేక హోదా డిమాండ్ వదిలి ప్యాకేజీ చాలని బాబు అంగీకరించడం.. అబద్ధమా షర్మిలా…? బాబుకు పోలవరం ఓ ఏటీఎం అంటూ స్వయానా ప్రధాని మోడే బహిరంగంగా ఆరోపించిన విషయం గుర్తు లేదా.. షర్మిలా..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలతో… ప్రత్యేక హోదాను పోల్చిన విషయం మర్చిపోయారా… షర్మిలా..? బాబు హయాంలోని జన్మభూమి కమిటీల ఆగడాలు, స్కిల్ కుంభకోణం వంటి తదితర అంశాలపై నోరు మెదపరేం…షర్మిల…?
అయితే, ఇవన్నీ అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు ఆంధ్ర ప్రజలనే విషయాన్ని గమనించడంలో మాత్రం షర్మిల.. తెలంగాణాలో వైఎస్సార్టీపీని అధికారంలోకి తెస్తానని విఫలమైనట్టే ఫెయిలయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా… పార్టీ విధి విధానాలెలా ఉండబోతున్నాయి… నాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో కాంగ్రెస్ వల్ల జరిగిన డ్యామేజీకి… ఆ ప్రాంతవాసిగా తాను ఏవిధమైన రెమెడీని తీసుకురాబోతోంది… అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలేంటి… అభివృద్ధి నమూనాకు ఎలాంటి విజన్ తో ముందుకెళ్లబోతున్నారనే విషయాలను ప్రచారంలో పెట్టకుండా.. ఫక్తూ అన్ననూ.. తన కుటుంబాన్ని తానే తిడుతూ రాష్ట్ర రాజకీయాలకు.. ఫ్యామిలీ పాలిటిక్స్ ను మిళితం చేసి కొత్త రాజకీయంతో తనపై కాస్తో కూస్తో ఏ కొందరిలోనో ఉన్న అభిమానానికి కూడా షర్మిల దూరమవ్వడం… రాజకీయ అపరిపక్వతే!
తెలుగుదేశం, జనసేన, కొన్ని పత్రికాధినేతల మౌత్ పీస్ గా కాకుండా.. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నానన్న సోయికి షర్మిల రావల్సి ఉంది.
ప్రత్యేకంగా తన అన్న జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా చేసే ఆరోపణలు… మీ ఇంటి తగువును బయటపెడతాయి… ఏ కొందరో రాక్షసానందం పొందేవారికి శ్రవణానందాన్నిస్తాయేమోగానీ… వ్యవస్థాగతంగా కాంగ్రెస్ కుగానీ… వ్యక్తిగతంగా తనకుగానీ.. ఏమాత్రం అంత ఒంటికి మంచిది కాదనే విషయాన్ని ఈ ఎన్నికల్లోపు షర్మిల తెలుసుకోవడం ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కష్టమేననిపిస్తోంది మరి..?